Andhra Pradesh: మంత్రి పేర్ని నానిపై దాడి కేసు దర్యాప్తు ముమ్మరం
- నిందితుడి సోదరి సహా టీడీపీ నేతలను విచారించిన పోలీసులు
- నేడు మరోమారు విచారణకు హాజరు కావాలని ఆదేశం
- టీడీపీతో సంబంధాలపైనే ప్రశ్నలు
ఏపీ మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడి కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. మంత్రిపై దాడిచేసిన నిందితుడు నాగేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిన్న టీడీపీ సీనియర్ నేతలైన మరకాని పరబ్రహ్మం, మాదిరెడ్డి శ్రీను, చిన్న శివ, నిందితుడు నాగేశ్వరరావు సోదరి బడుగు ఉమాదేవి తదితరులను పోలీసులు విడివిడిగా ప్రశ్నించారు.
నాగేశ్వరరావు టీడీపీ కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటాడా? మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వద్దకు వెళ్తుంటాడా? వంటి ప్రశ్నలు సంధించారు. నేటి ఉదయం మరోసారి పోలీస్ స్టేషన్‌కు రావాలని చెప్పి పంపించారు. అలాగే, మంత్రి నాని ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు, విచారణ నిమిత్తం నిందితుడిని తమకు కస్టడీకి ఇవ్వాలంటూ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.