Corona Virus: కరోనా వ్యాక్సిన్ కోసం ఆయా సంస్థల ముమ్మర ప్రయత్నాలు... ఎవరి టీకా ఎంతవరకొచ్చిందంటే..!
- ప్రపంచ సంస్థలతో భాగస్వామ్యమైన భారత ఫార్మా
- వ్యాక్సిన్ కనుగొనే పనిలో 11 సంస్థలు
- అందరి కళ్లూ సీరమ్, భారత్ బయోటెక్ పైనే
- రంగంలో ఉన్న జైడస్ కాడిలా, డాక్టర్ రెడ్డీస్
ప్రపంచంలోని ఎన్నో దేశాలు కరోనాను నిరోధించే వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు పరుగులు పెడుతున్నాయి. ఈ దిశగా దాదాపు అన్ని కంపెనీలూ ఇండియాకు చెందిన ఏదో ఒక ఫార్మా సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇండియాకు చెందిన 11 సంస్థలు వ్యాక్సిన్ కనుగొనే పనిలో బిజీగా ఉన్నాయి. మరే దేశానికి చెందిన ఇన్ని సంస్థలు ఇదే పనిలో లేవంటే అతిశయోక్తి కాదు. ఇక ఇండియాలోని ఏ ఫార్మా సంస్థ ఎన్ని వ్యాక్సిన్లను పరిశీలిస్తోంది, వాటి ట్రయల్స్ ఎంతవరకూ వచ్చాయన్న విషయాన్ని పరిశీలిస్తే...
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మొత్తం ఐదు వ్యాక్సిన్లపై పరిశోధనలు చేస్తోంది. వీటిల్లో తొలుత చెప్పుకోతగ్గది కొవిషీల్డ్. ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ కు సంబంధించి ఇప్పుడు రెండు, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. ఆపై నోవావాక్స్, అమెరికా తయారు చేసిన కోవాక్స్ రెండో దశ ట్రయల్స్ లో ఉండగా, సీరమ్ సొంతంగా తయారు చేస్తున్న కోవివాక్స్ క్లినికల్ ముందస్తు దశలో ఉంది. వాటితో పాటు అమెరికాకు చెందిన కోడాజెనిక్స్ తయారు చేసిన కోవి-వాక్, పిట్స్ బర్గ్ వర్శిటీ రూపొందించిన ఎస్-11 కోవాక్స్ లు క్లినికల్ ముందస్తు దశలో ఉన్నాయి.
ఇక భారత్ బయోటెక్ విషయానికి వస్తే, ఈ సంస్థ మూడు వ్యాక్సిన్లను పరిశీలిస్తోంది. పూర్తి దేశవాళీ పరిజ్ఞానంతో ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ ల సహకారంతో తయారుచేసిన కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ లో ఉంది. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ ను యూఎస్ కు చెందిన వాషింగ్టన్ వర్శిటీ సహకారంతో తయారు చేస్తోంది. ఈ వ్యాక్సిన్ ముందస్తు దశ క్లినికల్ పరీక్షల్లో ఉంది. వీటితో పాటు రేబిస్ వ్యాక్సిన్ పైనా భారత్ బయోటెక్ పనిచేస్తోంది.
కాగా, జైడస్ కాడిలా సంస్థ సొంతంగా పరిశోధించి తయారు చేసిన జైకోవ్-డి వ్యాక్సిన్ రెండు, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉండగా, తట్టు వ్యాక్సిన్ పైనా సంస్థ పరిశోధనలు సాగిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, రష్యాకు చెందిన గమేలియా సంస్థ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తోంది. బయోలాజికల్-ఇ సంస్థ అమెరికాకు చెందిన బేలర్ మెడికల్ కాలేజీ, డైనావాక్స్ తో కలిసి తయారు చేసిన వ్యాక్సిన్ తొలి, రెండో దశ ట్రయల్స్ ను నిర్వహిస్తోంది.
వీటితో పాటు ఇండియన్ ఇమ్యునో లాజికల్స్ సంస్థ ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ వర్శిటీ తయారు చేసిన వ్యాక్సిన్ తొలి దశ ట్రయల్స్ నిర్వహిస్తుండగా, అరబిందో ఫార్మా సంస్థ సీసీఎంబీ, ఐఎంటెక్, కోల్ కతాకు చెందిన ఐఐసీబీలతో కలిసి తయారు చేసిన టీకాను ముందస్తు క్లినికల్ దశలో భాగంగా పరిశీలిస్తోంది. జెనోవా బయో ఫార్మా సంస్థ ఎంఆర్ఎన్ఏ ఆధారంగా తయారు చేసిన వ్యాక్సిన్ కు ముందస్తు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. హెస్టల్ బయోసైన్ సంస్థ వ్యాక్సిన్, రిలయన్స్ లైఫ్ సైన్సెస్ సొంతంగా పరిశోధిస్తున్న వ్యాక్సిన్, మైన్ వాక్స్ వ్యాక్సిన్ లు కూడా ముందస్తు క్లినికల్ దశలో ఉన్నాయి.