Sajjanar: ఓటేసిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి: సజ్జనార్ కీలక వ్యాఖ్యలు
- పోలింగ్ శాతం తగ్గడం మంచిది కాదు
- యువత, ఉద్యోగులు ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు
- ఈసీ చొరవ తీసుకోవాలన్న సజ్జనార్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఓటేసిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, అలా చేస్తే, తదుపరి ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచవచ్చని అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలు తప్పనిసరిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటేసిన వారికి లాభం కలుగుతుందన్న భావన ప్రజల్లో పెరగాలని కోరారు.
పోలింగ్ రోజున సెలవు ప్రకటించడంతో యువత, ముఖ్యంగా ఐటీ సెక్టారులో ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులు ఓటేసేందుకు ఎంతమాత్రమూ ఆసక్తిని చూపలేదని, ఆ కారణంగానే పోలింగ్ శాతం తగ్గిందని సజ్జనార్ వ్యాఖ్యానించారు. పోలింగ్ శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు, ఎన్నికల కమిషన్ కలిసి ఓ సమావేశం నిర్వహించి, నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
యువత, విద్యార్థుల ఓటింగ్ హిస్టరీని తయారు చేసి, కాలేజీలు, కోర్సుల్లో అడ్మిషన్ల సమయంలో ప్రాధాన్యత ఇవ్వాలని, సర్టిఫికెట్ల జారీలో, ఉద్యోగాల విషయంలోనూ ఓటేస్తేనే తమకు లాభం కలుగుతుందన్న భావన వారిలో రావాలని అన్నారు. ఇందుకోసం రాజకీయ పార్టీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి ఓ ఉన్నత స్థాయి కమిటీని ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసి, వ్యూహ రచన చేయాల్సిన అవసరం ఉందని సజ్జనార్ అభిప్రాయపడ్డారు.