Anil Kumar Yadav: పోలవరం ఎత్తు ఒక్క మిల్లీ మీటర్ కూడా తగ్గదు: మంత్రి అనిల్
- పోలవరంపై టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోంది
- గత టీడీపీ ప్రభుత్వ తప్పులను మేము సరి చేస్తున్నాం
- 2021 డిసెంబర్ నాటికి పోలవరంను పూర్తి చేస్తాం
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జీవనాడిగా పేర్కొంటున్న పోలవరం ప్రాజెక్టుపై ఇటీవలి కాలంలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. పోలవరం బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ఈ వార్తలు మరింత పెరిగాయి. డ్యామ్ ఎత్తును వైసీపీ ప్రభుత్వం తగ్గించబోతోందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అసెంబ్లీ సాక్షిగా ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టతను ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ లేనిపోని అపోహలను కల్పిస్తోందని ఆయన మండిపడ్డారు. డ్యామ్ ఎత్తును తగ్గిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. డ్యామ్ ఎత్తు ఒక్క మిల్లీమీటర్ కూడా తగ్గించబోమని స్పష్టం చేశారు. పోలవరం అంచనా వ్యయంలో గత టీడీపీ ప్రభుత్వం తప్పులు చేసిందని... తాము వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఏనాడూ పోలవరంను పట్టించుకోలేదని అన్నారు. 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. డ్యామ్ ప్రారంభోత్సవానికి చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానిస్తామని అన్నారు.