Pawan Kalyan: రైతు సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారు: పవన్ కల్యాణ్
- వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి
- రూ. 35 వేల వంతున ఆర్థిక సాయం అందించాలి
- కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల మేలు కోసమే
కొత్త వ్యవసాయ చట్టాలు, ఢిల్లీలో రైతుల చేస్తున్న ఆందోళనలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల మేలు కోసమే బీజేపీ సర్కారు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు. రైతులను బలోపేతం చేయడానికే మోదీ ఈ చట్టాలను తీసుకొచ్చారని అన్నారు. చట్టాల్లో లోటుపాట్లు ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని చెప్పారు. చట్టాల సవరణకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. కొంత మంది కావాలనే ఈ చట్టంపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
తుపాన్ వల్ల పంటను కోల్పోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ కోరారు. ప్రతి రైతుకు రూ. 35 వేల వంతున నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. జైకిసాన్ పేరుతో త్వరలోనే ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. రైతులకు అండగా ఉండేలా ఓ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. దళారీ వ్యవస్థ వల్ల రైతులు చాలా నష్టపోతున్నారని, ఆ వ్యవస్థను నిర్మూలించి రైతులకు లాభసాటి ధర వచ్చేలా కార్యాచరణను సిద్ధం చేస్తామని చెప్పారు.
రైతు సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారని పవన్ విమర్శించారు. రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు. మద్యం, ఇసుక వల్ల ఎంతో గడిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రైతులకు రావాల్సింది గిట్టుబాటు ధర కాదని, లాభసాటి ధర అని అన్నారు. పంట నష్టంపై నివేదిక తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామని చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.