IBM: హ్యాకర్లు కరోనా పంపిణీ వ్యవస్థలను టార్గెట్ చేస్తున్నారు: ఐబీఎం

IBM warns corona vaccine cold chain service providers
  • కోల్డ్ చైన్ విధానంలో వ్యాక్సిన్ రవాణా
  • అంతర్జాతీయ హ్యాకర్లు రంగంలోకి దిగారన్న ఐబీఎం
  • చైనా సంస్థ ప్రతినిధి పేరిట ఫిషింగ్ మెయిళ్లు
కరోనా వ్యాక్సిన్  పంపిణీ చేసే సంస్థలు జాగ్రత్తగా ఉండాలని, వ్యాక్సిన్ రవాణా చేసే సంస్థల డేటాపై అంతర్జాతీయ హ్యాకర్ల బృందం కన్నేసిందని ఐటీ దిగ్గజం ఐబీఎం హెచ్చరించింది. ఈ మేరకు తమ నిపుణుల బృందం హ్యాకర్ల పన్నాగాన్ని తెలుసుకుందని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా అందించే క్రమంలో కోల్డ్ చైన్ విధానం పాటించాల్సి ఉంటుందని ఐబీఎం తెలిపింది.

ఉత్పత్తి కేంద్రాల నుంచి అత్యంత శీతలీకరణ ఏర్పాట్లతో వ్యాక్సిన్ ను రవాణా చేస్తారని, ప్రజల వద్దకు వ్యాక్సిన్ డోసులు వెళ్లేవరకు అవి చల్లని వాతావరణంలోనే ఉండాలని వివరించింది. ఈ మధ్యలో ఎక్కడ శీతలకరణకు ఆటంకాలు ఏర్పడినా వ్యాక్సిన్లు పాడైపోయే అవకాశం ఉంటుంది. కరోనా వ్యాక్సిన్లను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద భద్రపరచాల్సి ఉంటుందని ఐబీఎం పేర్కొంది. ఫైజర్, బయో ఎన్ టెక్ ఎస్ఈ వంటి ఫార్మా కంపెనీలు ఎంత భద్రమైన కోల్డ్ చైన్ విధానాన్ని రూపొందిస్తాయన్న అంశాన్ని గమనిస్తున్నామని తెలిపింది.

అయితే, ఎంతో ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో రంగంలోకి దిగిన హ్యాకర్ల బృందం కోల్డ్ చైన్ అంశంపై సమాచారం సేకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను తమ సైబర్ సెక్యూరిటీ బృందం గుర్తించిందని పేర్కొంది. ఈమెయిళ్ల రూపంలో ఎంతో నేర్పుగా పన్నిన వలలు విసురుతున్నారని, చైనాకు చెందిన హైర్ బయోమెడికల్ అనే కోల్డ్ చైన్ సేవల సంస్థ ప్రతినిధి పేరుతో ఈమెయిళ్లు పంపుతున్నారని ఐబీఎం వివరించింది.

ఈ హ్యాకర్లు అతి భారీస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని, అప్రమత్తంగా లేకుంటే కరోనా వ్యాక్సిన్ కోల్డ్ చైన్ ప్రక్రియకు భంగం కలుగుతుందని ఐబీఎం అనలిస్ట్ క్లెయిర్ జబయేవా తెలిపారు.
IBM
Hackers
Corona Virus
Vaccine
Cold Chain
China

More Telugu News