Maharashtra: నా మంత్రులను నేను విశ్వసిస్తున్నాను.. వారి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు: ఉద్ధవ్ థాకరే
- మరో మూడు నెలల్లో మహారాష్ట్రలో అధికారంలోకి వస్తామన్న కేంద్రమంత్రి
- తమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందన్న ఉద్ధవ్
- రైతుల దుస్థితి కెనడాకు అర్థమైనా, కేంద్రానికి పట్టడం లేదన్న శరద్ పవార్
తన మంత్రులను తాను విశ్వసిస్తున్నానని, వారి ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో మూడు నెలల్లో ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారంలోకి వస్తుందన్న కేంద్రమంత్రి ధాన్వే వ్యాఖ్యలపై ఉద్ధవ్ స్పందిస్తూ.. మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వం స్థిరమైనదని, మంత్రులందరూ బాగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు.
తమ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉందని, మంచి పనులు చేస్తుండడంతో ప్రజలు తమను అంగీకరించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ.. మన రైతుల దుస్థితిని ఎక్కడో ఉన్న కెనడా నేతలు అర్థం చేసుకున్నా, కేంద్రానికి మాత్రం పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.