Online loan: యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ అప్పు!
- క్రికెట్ బెట్టింగు కోసం ఆన్‌లైన్‌లో రూ. 16 వేల రుణం
- చెల్లించకపోవడంతో లీగల్ నోటీసులు
- మనస్తాపంతో ఉరి వేసుకున్న యువకుడు
ఆన్‌లైన్‌లో తీసుకున్న రుణం ఓ యువకుడికి యమపాశమైంది. తీసుకున్న అప్పు చెల్లించలేకపోవడంతో రుణ సంస్థ నుంచి ఒత్తిడి పెరిగింది. అప్పు తీర్చే మార్గం కానరాక చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిందీ ఘటన. డిగ్రీ పూర్తి చేసిన ఎద్దు శ్రావణ్ (24) ఇటీవల క్రికెట్ బెట్టింగుకు అలవాటు పడ్డాడు. బెట్టింగు కోసం ఢిల్లీకి చెందిన ఆన్‌లైన్ రుణ సంస్థ నుంచి రెండు నెలల క్రితం రూ. 16 వేల రుణం తీసుకున్నాడు. ఈ సొమ్మును బెట్టింగులో పెట్టి నష్టపోయాడు. ఫలితంగా తీసుకున్న రుణం చెల్లించలేకపోయాడు.
నిర్ణీత సమయానికి రుణం తిరిగి చెల్లించలేకపోవడంతో రుణ సంస్థ నుంచి ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ చెల్లించలేకపోవడంతో సంస్థ లీగల్ నోటీసులు పంపింది. దీంతో భయపడిపోయిన శ్రావణ్.. డబ్బులు చెల్లించేందుకు తనకు ఒక రోజు సమయం కావాలని సంస్థ ప్రతినిధులను అభ్యర్థించాడు. వారందుకు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి పెంట్‌హౌస్ రెయిలింగుకు ఉరివేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.