Narendra Modi: కరోనా వ్యాక్సిన్ లభ్యత, పంపిణీపై నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం!
- నేడు వర్చ్యువల్ విధానంలో మోదీ సమావేశం
- పాల్గొననున్న అన్ని పార్టీల నేతలు
- వ్యాక్సిన్ నెట్ వర్క్ ఏర్పాటు పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
ఇండియాలో కరోనా వ్యాక్సిన్ లభ్యత, ఆపై దాని పంపిణీ ప్రక్రియపై కేంద్రం నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ వర్య్చువల్ విధానంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుండగా, అన్ని పార్టీలతోనూ వ్యాక్సిన్ పై చర్చించడమే ప్రధాన అజెండా. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, వ్యాక్సిన్ నెట్ వర్క్ ఏర్పాటుపై మోదీ మాట్లాడనున్నారు. ఈ సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుండగా, లోక్ సభ, రాజ్యసభలోని అన్ని పార్టీల నేతలనూ సమావేశానికి రావాలని పిలిచారు.
మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోమ్ మంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి హర్ష వర్దన్ లు కూడా సమావేశానికి హాజరవుతారని, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ఉంటారని అధికారులు వెల్లడించారు. ఇక శీతాకాల సమావేశాలను రద్దు చేసి, జనవరి నెలాఖరులో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలతో కలిపి నిర్వహించాలన్న విషయంపైనా చర్చ జరుగుతుందని సమాచారం.
ఇదిలావుండగా, సాధ్యమైనంత త్వరలో శీతాకాల సమావేశాలు నిర్వహించి, రైతు సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని, చైనా దుందుడుకు చర్యలు, కరోనా పరిస్థితిపైనా అత్యవసరంగా చర్చ జరపాలని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ డిమాండ్ చేశారు.
ఇదిలావుండగా, ప్రస్తుతానికి దేశం ఎదుర్కొంటున్న అత్యంత ప్రధానమైన కరోనా సమస్యపైనే కేంద్రం దృష్టిని సారించనుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే గత నెల 24న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ, 28వ తేదీన వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్న కంపెనీలను కూడా సందర్శించి వచ్చారన్న సంగతి తెలిసిందే. ఆపై 30న వ్యాక్సిన్ తయారీ సంస్థలైన జెనోవా బయో ఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ తదితర సంస్థలతోనూ మాట్లాడారు.
ఇండియాలో ప్రస్తుతం ఐదు వ్యాక్సిన్ లను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. వీటి ట్రయల్స్ ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే, తొలి దశలో కోటి మంది హెల్త్ వర్కర్లకు ఇస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలోని 92 శాతం జాబితా, ప్రైవేటు ఆసుపత్రులలోని 52 శాతం మంది వైద్య సిబ్బంది జాబితా తమకు చేరిందని కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.