Kulbhushan Jadav: కులభూషణ్ జాదవ్ పై మరో కేసును మోపే కుట్రలో పాకిస్థాన్: మండిపడిన ఇండియా!
- 2008లో సరిహద్దులు దాటిన ఇస్మాయిల్
- గూఢచర్యం ఆరోపణలపై ఐదేళ్ల శిక్ష
- ఇప్పుడు రెండు కేసులనూ పోలుస్తున్న పాక్
ఇప్పటికే పాకిస్తాన్ జైల్లో చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తున్న కులభూషణ్ జాదవ్ పై మరో కేసును పెట్టాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని భారత విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇప్పటికే శిక్షాకాలాన్ని పూర్తి చేసుకుని కూడా పాక్ జైలు నుంచి విడుదల కాని ఇస్మాయిల్ సమ్మా కేసుతో లింక్ పెట్టాలని చూస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ వెల్లడించారు. గుజరాత్ లోని కచ్ జిల్లా ననా దినారా గ్రామానికి చెందిన ఇస్మాయిల్, ఆగస్టు 2008లో పశువులను మేపుతూ, సరిహద్దులు దాటి వెళ్లిపోగా, అతన్ని పాక్ జవాన్లు అరెస్ట్ చేశారు.
ఆపై అక్టోబర్ 2011లో అతనిపై గూఢచర్యం ఆరోపణలను మోపగా, ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ శిక్షాకాలాన్ని అతను పూర్తి చేసుకున్నాడు. అయినా అతన్ని ఇంకా విడుదల చేయలేదు. ఇప్పుడు ఆ కేసుతో కుల్ భూషణ్ కేసును కలపి, ఇస్మాయిల్ విడుదలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనురాగ్ వెల్లడించారు.
భారత హై కమిషన్ తరఫున ఇప్పటికే ఇస్మాయిల్ సమ్మా విడుదలకై కోర్టును కోరామని, అయితే, ఆ సమయంలో పాకిస్థాన్ అటార్నీ జనరల్ కల్పించుకుని రెండు కేసులనూ కలిపే ప్రయత్నం చేశారని, అసలు ఈ కేసులకు సంబంధమే లేదని తెలియజేశారు. జాదవ్ పై మరో కేసును జోడించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.