Narendra Modi: 'గ్రేటర్' హీరోలు కిషన్ రెడ్డి, బండి సంజయ్... ఫోన్ ద్వారా అభినందించిన మోదీ, అమిత్ షా
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 48 డివిజన్లలో విజయం
- గతంలో లేని విధంగా బీజేపీకి ప్రజాదరణ
- ఆనందంలో తేలిపోతున్న బీజేపీ శ్రేణులు
- ప్రశంసల జల్లు కురిపించిన మోదీ, అమిత్ షా, నడ్డా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా 48 డివిజన్లలో జయభేరి మోగించి భవిష్యత్తుపై కొండంత ఆత్మవిశ్వాసం నింపుకుంది. ఈ ఘనత తెలంగాణ బీజేపీ శ్రేణులనే కాదు, ఆ పార్టీ అధినాయకత్వాన్ని కూడా సంతోషానికి గురిచేసింది.
ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, జీహెచ్ఎంసీ బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ కిషన్ రెడ్డిని ఫోన్ లో అభినందించారు. గ్రేటర్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించారంటూ ప్రశంసించారు. కిషన్ రెడ్డికి బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా సైతం ఫోన్ చేసి అభినందనల జల్లు కురిపించారు.
అటు అమిత్ షా తెలుగులో ట్వీట్ చేసి తమ ఉత్సాహాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ సాగిస్తున్న రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అని ట్వీట్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శనకు గాను జేపీ నడ్డా గారికి, బండి సంజయ్ గారికి అభినందనలు అని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తల కృషిని అభినందిస్తున్నాను అని తెలిపారు.
అంతకుముందు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందిస్తూ, బీజేపీ కార్యకర్తల వీరోచిత పోరాటాల ఫలితమే ఈ ఫలితాలు అని వెల్లడించారు. గెలిచిన అభ్యర్థులతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తామని తెలిపారు.