Pawan Kalyan: భవిష్యత్తులో 'సీఎం మెడల్' మద్యం బ్రాండు కూడా తెస్తారేమో!: పవన్ వ్యంగ్యం
- ఏపీ మద్యం బ్రాండ్లపై పవన్ విసుర్లు
- ఇంకెన్ని బ్రాండ్లు ఉన్నాయో తనకు తెలియదన్న పవన్
- మద్యనిషేధం అని చెప్పి అమ్మకాలు సాగిస్తున్నారని ఆరోపణ
ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ ప్రభుత్వం మొదట మద్యనిషేధం అని చెప్పిందని, కానీ ఇప్పుడు వారే మద్యానికి స్పాన్సర్లుగా మారారని విమర్శించారు. మనకు 'ప్రెసిడెంట్ గ్యాలంట్రీ మెడల్' (రాష్ట్రపతి అవార్డు) గురించి తెలుసని, కానీ అదే పేరుతో 'ప్రెసిడెంట్ మెడల్' అంటూ ఓ మద్యం బ్రాండు తీసుకువచ్చారని వెల్లడించారు. 'సుప్రీం', 'బూమ్', 'గోల్డెన్ ఆంధ్రా' పేరిట వైసీపీ ప్రభుత్వమే మద్యం బ్రాండ్లు తీసుకువచ్చిందని ఆరోపించారు.
రాష్ట్రంలో మద్యం దొరక్కుండా చేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ, తమదైన శైలిలో కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టిందని అన్నారు. ఇవేకాకుండా ఇంకెన్ని బ్రాండ్లు ఉన్నాయో తనకు తెలియదని, భవిష్యత్తులో వైసీపీ పేరుతో 'వైసీపీ స్పెషల్', 'వైసీపీ బ్లూ లేబుల్', 'వైసీపీ రెడ్ లేబుల్' అంటూ మరిన్ని బ్రాండ్లు తెస్తారేమోనని వ్యంగ్యం ప్రదర్శించారు. బహుశా 'సీఎం మెడల్' అంటూ ఇంకో బ్రాండ్ కూడా తీసుకురావొచ్చని ఎద్దేవా చేశారు.