Canada PM: భారత హెచ్చరికను లెక్కచేయని కెనడా ప్రధాని... మరోసారి రైతుల నిరసనలపై వ్యాఖ్యలు
- ఢిల్లీలో రైతుల నిరసనలకు మద్దతు పలికిన జస్టిన్ ట్రూడో
- తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దన్న భారత్
- కెనడా రాయబారికి సమన్లు జారీ
- మరోసారి అవే వ్యాఖ్యలు చేసిన ట్రూడో
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మద్దతు పలకడం తెలిసిందే. దీనిపై భారత్ ఇప్పటికే హెచ్చరికలు చేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం వద్దంటూ భారత్ లో కెనడా రాయబారికి సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ కెనడా ప్రధాని మరోసారి వ్యాఖ్యలు చేశారు. తన పాత వ్యాఖ్యలనే పునరావృతం చేశారు.
శాంతియుత నిరసనలకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ట్రూడో స్పష్టం చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ శాంతియుత నిరసనలు జరుగుతున్నా కెనడా అందుకు బాసటగా నిలుస్తుందని తేల్చి చెప్పారు.
కాగా, కెనడా ప్రధాని వ్యాఖ్యలను బ్రిటన్ లోని సిఖ్ కౌన్సిల్ స్వాగతించింది. రైతుల నిరసనలకు మద్దతు పలికిన కెనడా ప్రధానికి రాజకీయనేతలు దన్నుగా నిలవాలని పిలుపునిచ్చింది. తద్వారా భారత్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను వ్యతిరేకించాలని కోరింది.