Kodali Nani: గవర్నర్ కు లేఖ రాయడానికి నిమ్మగడ్డ ఎవరు?: కొడాలి నాని
- స్థానిక ఎన్నికలపై అసెంబ్లీలో తీర్మానం!
- ఆర్డినెన్స్ తిరస్కరించాలని గవర్నర్ కు నిమ్మగడ్డ లేఖ
- గవర్నర్ కు లేఖ రాసే స్థాయి నిమ్మగడ్డకు లేదన్న నాని
- చంద్రబాబు బినామీ అంటూ వ్యాఖ్యలు
ప్రభుత్వ సమ్మతితోనే స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకునేలా అసెంబ్లీలో తీర్మానం చేశారని, దానికి సంబంధించిన ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాయడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంపై గవర్నర్ కు లేఖ రాయడానికి నిమ్మగడ్డ ఎవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేయాలో గవర్నర్ కు చెప్పేంత స్థాయి నిమ్మగడ్డకు లేదని స్పష్టం చేశారు.
2018 జూన్ లోనే పంచాయతీల కాలపరిమితి ముగిసిందని, కానీ 2019 మే వరకు నిమ్మగడ్డ ఎందుకు ఎన్నికలు జరపలేదని ప్రశ్నించారు. ప్రజలను, ప్రభుత్వాన్ని లక్ష్యపెట్టని నిమ్మగడ్డను తాము ఎస్ఈసీగా గుర్తించబోమని స్పష్టం చేశారు. చంద్రబాబు బినామీ అయిన నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తామంటే తాము అంగీకరించబోమని అన్నారు. చంద్రబాబు ఏది చెబితే అది చేసే నిమ్మగడ్డను గుర్తించేదెవరు? అంటూ మండిపడ్డారు.