Russia: వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రష్యా
- మాస్కోలో వ్యాక్సినేషన్ సెంటర్ల ఏర్పాటు
- తొలుత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా
- వ్యాక్సినేషన్‌పై అంతర్జాతీయ నిపుణుల అభ్యంతరం
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తాను అభివృద్ధి చేసుకున్న ‘స్పుత్నిక్-వి’ టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రష్యా నిన్న ప్రారంభించింది. రాజధాని మాస్కోలో కేసులు అత్యధికంగా నమోదవుతుండడంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తొలుత అక్కడే మొదలుపెట్టింది. ఇందుకోసం డజనుకుపైగా టీకా సెంటర్లు ఏర్పాటు చేసింది. ఆరోగ్య సిబ్బంది, మునిసిపల్ వర్కర్లు, ఉపాధ్యాయులు తదితరులు టీకాను తీసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
‘స్పుత్నిక్-వి’ టీకా 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని రష్యా చెబుతుండగా, మరోవైపు, ఇంకా మూడో దశ ప్రయోగాలు జరుగుతుండడంతో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అంతర్జాతీయ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను రెండు దఫాలుగా ఇవ్వాల్సి ఉంటుంది. తొలి డోసు ఇచ్చిన 21 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు. కాగా, ప్రభుత్వ అధికారులు, సైన్యంలో పనిచేస్తున్న దాదాపు లక్షమందికి ఇప్పటికే ఈ టీకాను ఇచ్చారు.