Rajinikanth: అసెంబ్లీ ఎన్నికలకు రజనీ కాంత్ ప్రణాళికలు!
- ఈ నెల 31న పార్టీని ప్రకటించనున్న తలైవా
- కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నాలు
- ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పార్టీ ఏజెంట్లు
- ఎన్నికల్లో పార్టీలతో పొత్తులపై జనవరిలో నిర్ణయం
కొత్త సంవత్సరంలో కొత్త పార్టీ పెడతానని సినీనటుడు రజనీకాంత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 31న పార్టీని ప్రకటించనున్నట్లు ఇటీవలే ఆయన ట్వీట్ చేశారు. ఆ రోజునే తాను అన్ని వివరాలను ప్రకటిస్తానని తెలిపారు.
ఆయన చేసిన ప్రకటనతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పార్టీ పెట్టకముందే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆయన ప్రణాళిక వేసుకుంటున్నారు. ఈ నెల 31లోగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును రిజిస్టర్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
తమిళనాడులోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పార్టీ ఏజెంట్లు తప్పనిసరిగా ఉండాలని ఆర్‌ఎంఎం (రజనీ మక్కల్ మండ్రం) సభ్యులకు సూచించారు. నియోజకవర్గాల్లో ప్రతి జోన్‌కు కనీసం ముప్పై మందికి తగ్గకుండా బూత్‌కమిటీ సభ్యులను నియమించాలని చెప్పారు.
చెన్నైలోని పోయెస్‌గార్డెన్‌లోని తన నివాసంలో పార్టీ సమన్వయకర్త తమిళురివి మణియన్‌తో ఆయన దాదాపు రెండు గంటలపాటు చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్న విషయమై రజనీకాంత్ జనవరిలో నిర్ణయం తీసుకుంటారని ఆర్‌ఎంఎం (రజనీ మక్కల్ మండ్రం) నేత ఒకరు తెలిపారు.