Alla Nani: 227 మంది అస్వస్థతకు గురయ్యారు.. బాధితులు పెరుగుతున్నారు: ఏపీ మంత్రి ఆళ్లనాని ప్రకటన
- ఏలూరులో జనాలకు అస్వస్థత
- బాధితుల్లో 105 మంది పురుషులు, 76 మంది స్త్రీలు, 46 మంది చిన్నారులు
- 70 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్
- కల్చర్ సెల్స్ సెన్సిటివిటి టెస్ట్ రిపోర్ట్ వస్తేనే ప్రజలకు వస్తోన్న వ్యాధి ఏమిటో తెలుస్తుంది
పశ్చిమ గోదావరి జిల్లాలోని తన సొంత నియోజక వర్గం ఏలూరులో జనాలు అస్వస్థతకు గురై పడిపోతోన్న ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఇప్పటివరకు ఏలూరులో 227 మంది అస్వస్థతకు గురయ్యారని, మూర్ఛ, వాంతులతో బాధపడుతున్న బాధితులు పెరుగుతున్నారని తెలిపారు.
బాధితుల్లో 105 మంది పురుషులు, 76 మంది స్త్రీలు, 46 మంది చిన్నారులు ఉన్నారని ఆయన వివరించారు. బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చేరి వైద్యం తీసుకుంటున్నారని చెప్పారు. 70 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
సమస్య ఉన్న ప్రాంతాల్లో మెరుగైన వైద్య క్యాంప్లు పెట్టామని, ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. కిడ్నీ, ఇతర వ్యాధులు ఉన్నవారి పరిస్థితి కాస్త విషమంగా ఉంటే వారిని విజయవాడకు తరలించామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని తెలిపారు.
నగరంలో నీటి సరఫరాలో ఎలాంటి కాలుష్యం లేదని, బాధితులకు చేసిన రక్త పరీక్షల్లో ఎలాంటి ఎఫెక్ట్ లేదని తెలిపారు. కల్చర్ సెల్స్ సెన్సిటివిటి టెస్ట్ రిపోర్ట్ వస్తేనే ప్రజలకు వస్తోన్న వ్యాధి ఏమిటో తెలుస్తుందని అన్నారు. ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నామని తెలిపారు. బాధితులకు బాసటగా ఉంటామని, ఎవరూ ఎటువంటి ఆందోళన చెందవద్దని తెలిపారు.