Governor: ఏలూరులో వింత వ్యాధిపై ఆరా తీసిన గవర్నర్ బిశ్వభూషణ్
- మూర్ఛ లక్షణాలతో ఆసుపత్రులపాలవుతున్న ప్రజలు
- వైద్యులకు కూడా అంతుబట్టని కారణాలు
- ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్
- మెరుగైన వైద్యం అందించాలని సూచన
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో వందల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల పాలవుతుండడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వ్యాధి లక్షణాలకు చికిత్స చేస్తున్నారే తప్ప ఆ వ్యాధి ఏంటన్నది వైద్యులకు కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. మూర్ఛ, వాంతులు, స్పృహకోల్పోతుండడం వంటి లక్షణాలతో పెద్దలు, పిల్లలు ఆసుపత్రులకు తరలివస్తున్నారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరా తీశారు.
ఒకేసారి వందల మంది అస్వస్థతకు గురికావడం పట్ల గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు సత్వరమే మెరుగైన వైద్యచికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్ సూచించారు.
కాగా, ఏలూరులో వింతవ్యాధి బారినపడిన ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరించిన వైద్య సిబ్బంది వాటిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఆ నివేదికలు వస్తే వ్యాధి గురించి ఏమైనా తెలిసే అవకాశముందని భావిస్తున్నారు. దీనిపై వైద్యశాఖ స్పందిస్తూ సమస్యకు కారణంపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిపింది. అయితే, ఉన్నతస్థాయి నిపుణుల సలహా తీసుకోవాలని గవర్నర్ వైద్యశాఖను కోరారు.
అటు ఈ వింత వ్యాధిని కొందరు మానసిక వైద్య నిపుణులు మాస్ హిస్టీరియాగా అభివర్ణిస్తున్నారు. అధికారులు వివిధ ప్రాంతాల నుంచి తాగునీటి శాంపిల్స్ సేకరిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి బాధితులు ఆసుపత్రులకు క్యూలు కట్టారు. దాంతో బాధితులకు ముందు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏలూరు పట్టణంలోని పడమర వీధి, దక్షిణ వీధి, గొల్లాయగూడెం, కొత్తపేట, శనివారపు పేట ప్రాంతాల నుంచి అత్యధిక కేసులు వచ్చినట్టు గుర్తించారు. దాంతో కాలనీల్లోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.