SP Manikanth Mishra: పెళ్లిపీటలపై ఉన్న వధూవరులతో కరోనా మంత్రాలు చదివించిన జిల్లా ఎస్పీ
- ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘటన
- పెళ్లి వేడుకకు హాజరైన ఎస్పీ మణికాంత్ మిశ్రా
- ఎస్పీ రాకతో ఉలిక్కిపడిన జనాలు
- పూజారి పక్కనే కూర్చుని కరోనా సూత్రాలు వివరించిన వైనం
- ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం తన బాధ్యత అని వెల్లడి
ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ జిల్లా ఎస్పీ మణికాంత్ మిశ్రా శాంతిభద్రతలే కాదు, కరోనాపై ప్రజలను చైతన్యవంతులను చేయడం కూడా తన బాధ్యతేనని బలంగా నమ్ముతున్నారు. తాను జిల్లా ఎస్పీ హోదాలో ఉన్నప్పటికీ ఎక్కడ పెళ్లి జరిగినా అక్కడికి వెళ్లి వధూవరులతో కరోనా మంత్రాలు చదివిస్తూ మీడియాలో సందడి చేస్తున్నారు.
తాజాగా బాగేశ్వర్ జిల్లాలో ఓ పెళ్లి జరుగుతుండగా ఎస్పీ మణికాంత్ మిశ్రా అక్కడికి కూడా వెళ్లారు. అప్పటివరకు ఆనందోత్సాహాలతో కళకళలాడిన పెళ్లివేదిక పోలీసు అధికారి రాకతో గంభీరంగా మారిపోయింది. ఆయన ఎందుకు వచ్చాడో తెలియక పూజారి, పెళ్లిపెద్దలు, వధూవరులు బిక్కచచ్చిపోయారు.
అయితే నేరుగా పెళ్లిమంటపం వద్దకు చేరుకున్న ఎస్పీ పూజారి పక్కనే కూర్చుని తాను వచ్చిన పని ప్రారంభించారు. వధూవరులతో కరోనా నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎంతో శ్రద్ధగా చదివించారు. ప్రజల్లో కరోనా పట్ల ఎలా అవగాహన కల్పించాలన్న విషయాన్ని మిశ్రా పెళ్లివేదిక పైనుంచి వివరించారు.
ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కూడా తన విధిలో భాగంగానే భావిస్తున్నానని, అందుకే ఎక్కువమంది హాజరయ్యే పెళ్లి వేడుకకు వచ్చి కరోనా నియమాలు అందరూ పాటించేలా చూస్తున్నానని వివరణ ఇచ్చారు. ఇకపై పూజారులు కూడా విధిగా పెళ్లిమంత్రాలతో పాటు కరోనా సూత్రాలు కూడా పెళ్లికొడుకు, పెళ్లికూతురుతో చెప్పించాలని అన్నారు.