Komali: ఏలూరులో వింత జబ్బు... తన కుమార్తెను కాపాడాలంటూ మంత్రికి యువతి సెల్ఫీ వీడియో
- ఏలూరులో ప్రబలుతున్న వింతరోగం
- పెరుగుతున్న బాధితుల సంఖ్య
- వ్యాధికి గురైన ప్రభ అనే బాలిక
- ప్రభను ఏలూరు నుంచి విజయవాడ తరలింపు
- కన్నీరుమున్నీరైన తల్లి కోమలి
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింతరోగం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 300 మంది వరకు ఈ వ్యాధి బారినపడినట్టు భావిస్తున్నారు. కాగా, ఓ యువతి తన కుమార్తెను కాపాడాలంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసింది. తన బిడ్డ కూడా వింత జబ్బు బారినపడిందని, అయితే ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగైన ఆసుపత్రి కోసం విజయవాడ పంపించారని తెలిపింది. గత 24 గంటలుగా తన బిడ్డ ఎలాంటి ఆహారం తీసుకోలేదని వెల్లడించింది.
తన పేరు కోమలి అని, తన కుమార్తె పేరు ప్రభ అని తెలిపింది. నిన్న మధ్యాహ్నం తన కుమార్తె అస్వస్థతకు గురికావడంతో నాలుగైదు ప్రైవేటు ఆసుపత్రులకు తిరిగినా ఎవరూ చేర్చుకోలేదని పేర్కొంది. చివరికి పెద్దాసుపత్రిలో చేర్చామని, అక్కడి నుంచి విజయవాడ పంపారని వివరించింది. తన బిడ్డ కళ్లు తిరిగి పడిపోతోందని, దయచేసి తమకు సాయం చేయాలంటూ ఆమె మంత్రిని వేడుకుంది.