Congress: కొత్త ఏడాదిలో తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్.. 2023 ఎన్నికలే లక్ష్యంగా ఎంపిక
- తెలంగాణకు నూతన సారథి ఎంపిక కోసం కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు
- రెండు రోజులపాటు హైదరాబాద్‌లో మకాం వేయనున్న మాణికం ఠాగూర్
- అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తికి పీసీసీ పగ్గాలు
ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను అధిష్ఠానం ఆమోదించనప్పటికీ ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న దానిపై అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా కొత్త అధ్యక్షుడి నియామకం ఉండాలని భావిస్తోంది.
ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్గా కుంతియా స్థానంలో తమిళనాడుకు చెందిన ఎంపీ మాణికం ఠాగూర్‌ను నియమించినప్పటికీ రాష్ట్రంలో పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన సారథిని నియమించడం ద్వారా పార్టీలో తిరిగి జవసత్వాలు నింపాలని అధిష్ఠానం యోచిస్తోంది.
పీసీసీ అధ్యక్ష పదవితోపాటు పదవులను భర్తీ చేయాలని, జిల్లా, పీసీసీ కార్యవర్గాల పునర్ వ్యవస్థీకరణ తదితర అంశాలపై అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. పీసీసీ అధ్యక్ష నియమాకంలో సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకోవాలని, నేతల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వాలని అధిష్ఠానం యోచిస్తోంది. మాణకం ఠాగూర్ హైదరాబాద్‌లో రెండు రోజులపాటు మకాం వేసి పీసీసీ ముఖ్యులు, సీనియర్ నేతలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ విభాగాలతో చర్చించి వారి అభిప్రాయాలను తమకు తెలియజేస్తారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.