Abdulla Danish: 19 ఏళ్లుగా పరారీలో ఉన్న సిమి ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు!
- యూపీలోని అలీగఢ్ సమీపంలో ఉన్నట్టు సమాచారం
- వెంటనే దాడులు చేసిన స్పెషల్ సెల్ పోలీసులు
- 2002 నుంచి మోస్ట్ వాంటెడ్ గా ఉన్న అబ్దుల్లా దనీష్
గత 19 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాది అబ్దుల్లా దనీష్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సిమీ ఉగ్రవాద సంస్థలో అబ్ధుల్లా కీలకమైన వ్యక్తని, ప్రస్తుతం 58 ఏళ్ల వయసులో ఉన్న అతన్ని మోస్ట్ వాంటెడ్ గా చాలా సంవత్సరాల క్రితమే ప్రకటించారని స్పెషల్ సెల్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ప్రమోద్ సింగ్ కుశ్వా తెలియజేశారు.
గడచిన 25 ఏళ్లలో ఎందరో ముస్లిం యువకులను అబ్దుల్లా ఉగ్రవాదులుగా మార్చారని, సిమీ మేగజైన్ హిందీ వర్షన్ కు అబ్దుల్లా ఎడిటర్ గానూ పని చేస్తున్నారని అన్నారు. యూపీలోని అలీగఢ్ పరిధిలో అబ్దుల్లాను గుర్తించామని, 2002లో ఓ ట్రయల్ కోర్టు అతన్ని మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించిందని, అప్పటి నుంచి అతని కోసం గాలిస్తూనే ఉన్నామని వెల్లడించారు.
గడచిన ఏడాది కాలంగా స్పెషల్ సెల్ అధికారి అత్తార్ సింగ్ నేతృత్వంలోని టీమ్ అబ్దుల్లాను ట్రాక్ చేస్తూ వచ్చిందని, ఇప్పటికి అతన్ని అరెస్ట్ చేయగలిగామని అన్నారు. ముస్లింలపై దాడులు జరుగుతున్నాయంటూ తప్పుడు వీడియోలను అబ్దుల్లా వైరల్ చేసేవాడని, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ది సిటిజన్ షిప్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలను ప్రోత్సహించాడని ప్రమోద్ సింగ్ పేర్కొన్నారు.
డిసెంబర్ 5న అబ్దుల్లా ఉన్న ప్రాంతం గురించిన విశ్వసనీయ సమాచారం అందగా, వెంటనే రైడింగ్ పార్టీని ఏర్పాటు చేశామని, వారు చాకచక్యంగా దాడి చేసి అబ్దుల్లాను అరెస్ట్ చేశారని వివరించారు. కాగా, అలీగఢ్ కేంద్రంగా సిమీ గ్రూప్ 1977లో ఏర్పడగా, కేంద్ర ప్రభుత్వం దాన్ని 2001లో నిషేధించింది.