WFP: 2021 మరింత భయానకం కానుంది: హెచ్చరించిన డబ్ల్యూఎఫ్పీ
- మరో విపత్తుకు ప్రజలు సిద్ధం కావాలి
- ఈ శతాబ్దంలోనే అత్యంత చెత్త సంవత్సరం కానున్న 2021
- కరవు, ఆకలి సమస్య కుదేలు చేయనుందన్న డేవిడ్ బీస్లీ
2020 సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా ఎంతో భారంగా నడుస్తూ, ముగింపు దశకు చేరుకుంది. కరోనాకు వ్యాక్సిన్ ను తీసుకుని వచ్చే 2021తో ప్రపంచం తిరిగి గాడిన పడుతుందని ప్రజలంతా ఆత్రుతగా ఎదురు చూస్తున్న వేళ, కొత్త సంవత్సరంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని డబ్ల్యూఎఫ్పీ (వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్) హెచ్చరించింది.
మరో విపత్తుకు ప్రజలు తమను తాము సిద్ధం చేసుకోవాలని డబ్ల్యూఎఫ్సీ చీఫ్ డేవిడ్ బీస్లీ కోరారు. రానున్న 2021 ఈ శతాబ్దంలో ప్రజలు చూసిన అత్యంత చెత్త సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనా వేసిన ఆయన, తీవ్రమైన కరవు, ఆకలి సమస్యలు ప్రపంచాన్ని కుదేలు చేయనున్నామని తెలిపారు. పేద దేశాల్లో ఈ ప్రభావం చాలా అధికంగా ఉంటుందని అన్నారు.
కరోనాపై ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం నిర్వహించగా, ప్రసంగించిన డేవిడ్ బీస్లీ, ప్రపంచంలోని 27 కోట్ల మంది ఆకలి వైపు పయనిస్తున్నారని, 2021లో తీవ్రమైన కరవు పీడించనుందని తెలిపారు. ఇదే సమయంలో కరోనా సంక్షోభం సైతం కొనసాగుతుందని, అందరికీ వ్యాక్సిన్ సరఫరాకు ఎంతో సమయం పట్టడమే ఇందుకు కారణమని అన్నారు. ఈ సంవత్సరం, కరోనా నివారణకు 19 ట్రిలియన్ డాలర్ల వరకూ ఖర్చయిందని పేర్కొన్న ఆయన, దీని ఫలితం 2021లోనూ దక్కే అవకాశాలు లేవని, ప్రపంచ వ్యవస్థ మరో మెట్టు దిగజారనుందని ఆయన హెచ్చరించారు.
ఈ ప్రభావం యెమెన్, దక్షిణ సూడాన్, సిరియా వంటి దేశాలను భయంకరంగా మార్చనుందని తెలిపిన ఆయన, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ పరిస్థితిని టైటానిక్ షిప్ తో పోల్చిన ఆయన, ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి, మరిన్ని నిధులను కేటాయిస్తే, నష్టం తక్కువగా ఉంటుందని అన్నారు.