Petrol: రెండేళ్ల గరిష్ఠానికి చేరుకున్న 'పెట్రో' ధరలు!
- నేడు కూడా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
- 25 నుంచి 33 పైసల వరకూ వడ్డన
- ముంబైలో రూ. 90 దాటిన పెట్రోలు ధర
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు రెండు సంవత్సరాల గరిష్ఠానికి చేరుకున్నాయి. తాజాగా లీటర్ పెట్రోలు, డీజిల్ పై 25 నుంచి 33 పైసల వరకు ధరలను పెంచుతున్నట్టు చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 83.71కి, డీజిల్ ధర రూ. 73.87కు చేరుకున్నాయి. నవంబర్ నెలలో 20వ తేదీ నుంచి ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత నెల 20తో పోలిస్తే, లీటరు పెట్రోలుపై రూ.3.65, డీజిల్ పై రూ. 3.40 వంతున ధరలు పెరిగాయి.
ఇక నేడు ముంబైలో పెట్రోలు ధర 33 పైసలు పెరిగి రూ.90.34కు చేరగా, కోల్ కతాలో రూ. 85.19కి, చెన్నైలో రూ. 86.51కి చేరింది. ఇదే సమయంలో డీజిల్ ధర ముంబైలో రూ. 80.51కి, కోల్ కతాలో రూ. 77.44కు, చెన్నైలో రూ. 79.21కి చేరాయి. ఒపెక్ దేశాలన్నీ ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడం, రష్యా కూడా అదే దారిలో నడుస్తూ ఉండటంతోనే క్రూడాయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా, నేడు మాత్రం క్రూడాయిల్ ధరలు కొంత మేరకు క్షీణించాయి. లండన్ మార్కెట్లో ధర అర శాతం పతనమై 49 డాలర్లకు చేరుకోగా, న్యూయార్క్ మార్కెట్లో 0.54 శాతం మేరకు క్రూాడాయిల్ ధర తగ్గించింది. ఇక జనవరి 2021లోనూ రోజుకు 7 మిలియన్ బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తి కోతను కొనసాగిస్తామని రష్యా సహా ఒపెక్ దేశాలు స్పష్టం చేశాయి. దీంతో ధరల పెరుగుదల మరింతగా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.