KK Venugopal: ప్రజాస్వామ్య పరిరక్షణకు సోషల్ మీడియా ఆంక్షలు కూడదు: అటార్నీ జనరల్
- నియంత్రించాలని చూస్తే వివాదాలు వస్తాయి
- అరుదైన కేసులను మాత్రమే ధిక్కార నేరాలుగా చూస్తాం
- ఇటీవలి కాలంలో ఎన్నో సూచనలు వస్తున్నాయన్న కేకే వేణుగోపాల్
సామాజిక మాధ్యమాల్లో స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించడాన్ని నియంత్రించాలని భావిస్తే, అది వివాదాలకు దారి తీస్తుందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలంటే సోషల్ మీడియా నియంత్రణలు కూడదని, అత్యంత అరుదైన కేసులను మాత్రమే కోర్టు ధిక్కార నేరాలుగా సుప్రీంకోర్టు పరిగణించాలని ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరిగే బహిరంగ చర్చలను అడ్డుకోవడం సరికాదని, ఓ పరిధిని దాటకుండా చేసే వ్యాఖ్యల గురించి ఇబ్బందులు ఉండవని, సాధారణంగా అటువంటి విమర్శలపై సుప్రీంకోర్టు కూడా స్పందించకుండా ఉంటుందని ఆయన అన్నారు.
ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు నిర్ణయాలపై సామాజిక మాధ్యమాల్లో పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలో బహిరంగ ప్రజాస్వామ్యం ఉందని, ఎవరైనా,ఏదైనా చర్చించే స్వేచ్ఛను కలిగివున్నారని వ్యాఖ్యానించిన కేకే వేణుగోపాల్, ఈ స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం ఎటువంటి అడుగులూ వేయరాదని ఆయన సూచించారు. ఇక చాలా అరుదుగా మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం కల్పించుకుంటుందని ఆయన అన్నారు.
ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార నేరాలను మోపాలని తనకు ఎన్నో సూచనలు వచ్చాయని, వాటిల్లో కార్టూనిస్ట్ కునాల్ కమ్రాపై మాత్రమే ఆరోపణలను నమోదు చేశామని వేణుగోపాల్ తెలిపారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి వ్యవహారంలో సుప్రీంకోర్టును ప్రశ్నిస్తూ, కునాల్ పలు వ్యంగ్య చిత్రాలను గీయగా, అవి కలకలం రేపాయి. అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ధర్మాసనాన్ని ప్రశ్నిస్తూ, రెండు ట్వీట్లను చేయగా, కోర్టు ధిక్కార అభియోగాలు నమోదై, ఆయనకు రూ. 1 జరిమానా విధించిన సంగతి తెలిసిందే.