Chandrababu: ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా పెళ్లిళ్లు, పేరంటాళ్లకు వెళతారా?: చంద్రబాబు ఆగ్రహం
- ఏలూరు ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యలు
- చేతకాని ప్రభుత్వం కారణంగా ప్రాణాలు పోతున్నాయని విమర్శ
- టీడీపీని దెబ్బతీయడంపైనే దృష్టి అంటూ ఆగ్రహం
- వితండవాదం చేస్తున్నారని విమర్శలు
- పద్ధతి ప్రకారం పారిశుద్ధ్యం నిర్వహిస్తే సమస్యలుండవని హితవు
చేతకాని ప్రభుత్వం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. ఎంతసేపూ టీడీపీని ఎలా దెబ్బతీయాలన్న ఆలోచన తప్ప, పాలనపై దృష్టి సారించడంలేదని మండిపడ్డారు. ఏలూరు ఘటనకు బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి పెళ్లిళ్లు, పేరంటాళ్లకు వెళతారా? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేయడంపై ఆసక్తి చూపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ లేదని ఆరోపించారు.
ఏలూరులో బాధితులకు అసలేం జరిగిందో తెలుసుకోకుండానే చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. ఈ ఘటనను వైసీపీ సర్కారు మొదట్లో పట్టించుకోలేదని, బాధితుల సమస్యలకు కారణాలు తెలియవని అనడం వితండవాదం కాక మరేమిటి? అని అన్నారు. ఓ క్రమపద్ధతిలో పారిశుద్ధ్యం నిర్వహిస్తే ఇలాంటి కష్టాలు ఉండవని చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.