Ravi Shankar Prasad: ఇప్పుడు మోదీ చేసింది అప్పట్లో కాంగ్రెస్ కూడా చేసింది: రవిశంకర్ ప్రసాద్
- ఉనికిని చాటుకోవడం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది
- శరద్ పవార్ మాట మార్చారు
- కష్టకాలంలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం కాంగ్రెస్, ఎన్సీపీలకు అలవాటే
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రధాని మోదీ ఇప్పుడు ఏం చేశారో... అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసిందని అన్నారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులను వ్యతిరేకిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వరుసగా అన్ని ఎన్నికలలో ఓడిపోతోందని... అందుకే ఉనికిని చాటుకోవడం కోసం ఇలాంటి పనులు చేస్తోందని విమర్శించారు.
2019 ఎన్నికల మేనిఫెస్టోలో మార్కెట్ కమిటీ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ తెలిపిందని చెప్పారు. గతాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా వ్యతిరేకిస్తున్నారని... గతంలో ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ మార్కెట్లలో మౌలిక సదుపాయాల నిమిత్తం ప్రైవేట్ రంగాన్ని కూడా చేర్చాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారని చెప్పారు. తమ నిరసన కార్యక్రమాల వేదికపైకి రాజకీయ నాయకులెవరూ రావొద్దొని రైతు సంఘాల నేతలు చెప్పారని... వారి ప్రకటనను తాము గౌరవిస్తామని తెలిపారు. రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైన సమయంలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం కాంగ్రెస్, ఎన్సీపీలకు అలవాటేనని చెప్పారు.