Kamal Hassan: కమలహాసన్ 'విక్రమ్'లో విలన్ గా మలయాళ నటుడు

Malayalam actor roped in as villain for Kamals movie
  • 'ఇండియన్ 2', 'విక్రమ్' సినిమాలలో కమల్  
  • లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్'
  • విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తాడంటూ వార్తలు 
  • తాజాగా విలన్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ ఎంపిక   
కథలో ఏదో ఒక కొత్తదనం ఉంటేనే కానీ కమలహాసన్ ఒక సినిమా ఒప్పుకోడు. ఆయన ఒప్పుకున్నాడంటే కచ్చితంగా అందులో ఏదో కొత్త పాయింట్ ఉంటుంది. అందుకే, ఆయన ఒక సినిమాలో నటిస్తున్నాడంటే ప్రేక్షకుల్లో ఆ చిత్రంపట్ల ఒకరకమైన ఆసక్తి.. కుతూహలం ఏర్పడతాయి. ఇందులో ఎటువంటి పాత్రలో ఆయన కనిపిస్తాడన్న ఉత్సుకత ప్రేక్షకుల్లో నెలకొంటుంది. అటువంటి విలక్షణ నటుడు కమల్ ప్రస్తుతం ఓపక్క 'ఇండియన్ 2'లో నటిస్తూనే.. మరోపక్క 'విక్రమ్' అనే సినిమాలో నటిస్తున్నారు.

ఆమధ్య కార్తీతో 'ఖైదీ' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఇప్పుడీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రధాన విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తాడంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తాజాగా ఈ పాత్రకు ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్  ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. గతంలో ఫాహద్ తమిళంలో కొన్ని సినిమాలలో విలన్ గా నటించినప్పటికీ, కమల్ తో నటించడం మాత్రం ఇదే ప్రథమం. ఇందులో ఫాహద్ ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపిస్తాడట.

ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. కమలహాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ కి అనిరుథ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
Kamal Hassan
Fahad Fazil
Vijay Setupati
Lokesh Kanagaraj

More Telugu News