Joe Biden: అమెరికా చరిత్రలో తొలిసారి.. రక్షణ మంత్రిగా నల్లజాతి వ్యక్తి లాయిడ్ ఆస్టిన్‌ను ఎంచుకున్న బైడెన్!
- 2003లో అమెరికా దళాలను బాగ్దాద్‌లోకి నడిపించిన లాయిడ్ ఆస్టిన్
- ఆస్టిన్ నియామకాన్ని శుక్రవారం ప్రకటించనున్న బైడెన్
- పదవి చేపట్టేందుకు సెనేట్ అంగీకారం అవసరం
అమెరికా చరిత్రలో తొలిసారి ఓ ఆఫ్రికన్-అమెరికన్ రక్షణ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. 2003లో అమెరికా దళాలను బాగ్దాద్‌లోకి నడిపించి, యూఎస్ సెంట్రల్ కమాండ్‌కు అధిపతిగా ఎదిగిన లాయిడ్ ఆస్టిన్‌ను జో బైడెన్ ఎంచుకున్నారు.
తన కేబినెట్‌లో మైనారీటీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న రక్షణ శాఖ మాజీ అండర్ సెక్రటరీ మిచెల్ ఫ్లోర్నోయ్ ఒత్తిడి మేరకు 67 ఏళ్ల ఫోర్ స్టార్ ఆర్మీ జనరల్ అయిన లాయిడ్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్‌లు పేర్కొన్నాయి. బైడెన్ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని, పదవి చేపట్టడానికి ముందు ఆస్టిన్‌కు సెనేట్ అంగీకారం అవసరమని సమాచారం.
ఆస్టిన్ నాలుగు దశాబ్దాలపాటు యూఎస్ ఆర్మీకి సేవలు అందించారు. 2003లో 3వ ఇన్ఫాంట్రీ డివిజన్‌కు అసిస్టెంట్ డివిజన్ కమాండర్‌గా వ్యవహరించిన ఆస్టిన్ ఇరాక్‌పై దాడిలో యూఎస్ సేనలను కువైట్ నుంచి బాగ్దాద్‌లోకి నడిపించారు. 2010లో ఇరాక్‌లోని అమెరికా దళాలకు కమాండింగ్ జనరల్‌గా నియమితులైన ఆస్టిన్.. రెండేళ్ల తర్వాత మధ్యప్రాచ్యం, ఆఫ్ఘనిస్థాన్‌లలో పెంటగాన్ కార్యకలాపాలకు బాధ్యత వహించే సెంట్రల్ కమాండ్‌కు కమాండర్‌గా వ్యవహరించారు.
2016లో మిలటరీ నుంచి రిటైర్ అయిన ఆయన అనంతరం పెంటగాన్ అతిపెద్ద కాంట్రాక్టర్స్‌లో ఒకటైన రేథియాన్ టెక్నాలజీస్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో చేరారు.