Nagarjuna: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మరింత ఆసక్తికరంగా ఉండబోతోంది: నాగార్జున
- సెప్టెంబరు 6న ప్రారంభమైన బిగ్ బాస్
- మరికొన్నిరోజుల్లో గ్రాండ్ ఫినాలే
- ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఆరుగురు కంటెస్టెంట్లు
- గతవారం 4 కోట్ల మంది వీక్షించారన్న నాగార్జున
- గత 12 వారాల్లో 83 శాతం వీక్షణలు వచ్చాయని వెల్లడి
రియాలిటీ షోలకు సరికొత్త అర్ధాన్ని చెప్పిన షో బిగ్ బాస్. తెలుగులో ప్రస్తుతం నాలుగో సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్లు మిగలగా, మరికొన్నిరోజుల్లో గ్రాండ్ ఫినాలే జరుపుకోనుంది. దీనిపై బిగ్ బాస్-4 హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ, ఈసారి బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోందని అన్నారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో బిగ్ బాస్ నాలుగో సీజన్ గత రికార్డులను అధిగమిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచిందని తెలిపారు. ఈ అతిపెద్ద రియాలిటీ షో ప్రతివారం కోట్ల మంది వీక్షకులకు వినోదాన్ని అందించడం ఎనలేని సంతృప్తి కలిగిస్తోందని పేర్కొన్నారు.
గత వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి బిగ్ బాస్ షోకు 4 కోట్ల వ్యూస్ లభించాయని, గత 12 వారాల్లో 83 శాతం మంది వీక్షకులు తమ కార్యక్రమాన్ని వీక్షించారని వివరించారు. ఇప్పుడు అత్యంత ఆసక్తికర దశలోకి బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రవేశించిందని, ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నాగార్జున వెల్లడించారు. సెప్టెంబరు 6న బిగ్ బాస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే.