CPI Ramakrishna: పవన్ కల్యాణ్ ను ప్రజలు అప్పుడే నమ్ముతారు: సీపీఐ రామకృష్ణ
- రైతుల పక్షాన పవన్ నిలబడాలన్న రామకృష్ణ
- వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించాలని డిమాండ్
- వైసీపీ, టీడీపీలు ఉద్యమించాలన్న మధు
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా రైతులకు సంఘీభావం తెలపడంతో... రెండు రాష్ట్రాల్లో కూడా బంద్ ప్రభావం కనపడుతోంది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, వ్యాపార సముదాయాలు కూడా మూతపడ్డాయి.
మరోవైపు విజయవాడలోని లెనిన్ సెంటర్లో రైతు సంఘాలతో కలిసి వామపక్షాలు, కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. నాగళ్లతో వామపక్షాలు ర్యాలీ చేశాయి. ఈ సందర్భంగా సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల పక్షాన పవన్ కల్యాణ్ కూడా నిలబడాలని డిమాండ్ చేశారు. పంట నష్టం విషయంలో రైతుల వైపు పవన్ ఎలా నిలబడ్డారో... ఇప్పుడు కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించాలని కోరారు. అప్పుడే పవన్ ను ప్రజలు నమ్ముతారని చెప్పారు.
ఇదే సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ, ఇప్పటికే వన్ నేషన్-వన్ ట్యాక్స్ విధానంతో జీఎస్టీని తీసుకొచ్చి సమస్యలు సృష్టించారని మండిపడ్డారు. ఇప్పుడు వన్ నేషన్-వన్ మార్కెట్ పేరుతో కొత్త ఇబ్బందులను తీసుకొస్తున్నారని చెప్పారు. వైసీపీ, టీడీపీలు రైతులకు సంఘీభావం ప్రకటించినంత మాత్రాన సరిపోదని... రైతుల పక్షాన ఉద్యమించాలని డిమాండ్ చేశారు.