Team India: కోహ్లీ పోరాటం వృథా... చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి
- సిడ్నీలో చివరి టీ20 మ్యాచ్
- భారత్ టార్గెట్ 187 రన్స్
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసిన భారత్
- 12 పరుగుల తేడాతో ఆసీస్ విజయం
- 85 పరుగులు చేసిన కోహ్లీ
- 3 వికెట్లు తీసిన స్వెప్సన్
ఆస్ట్రేలియాతో చివరిదైన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆసీస్ ఈ మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో నెగ్గింది. టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ హైలైట్ అని చెప్పాలి. కోహ్లీ 61 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 85 పరుగులు చేశాడు.
చివర్లో శార్దూల్ ఠాకూర్ 7 బంతుల్లో 2 సిక్సులతో 17 పరుగులు చేశాడు. శార్దూల్ భారీ సిక్సులు కొట్టడంతో కొద్దిగా ఆశలు కలిగినా, సాధించాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో టీమిండియాకు గెలుపు సాధ్యం కాలేదు. చిచ్చరపిడుగు హార్దిక్ పాండ్య కూడా ధాటిగా ఆడినా, దురదృష్టవశాత్తు జంపా బౌలింగ్ లో వెనుదిరిగాడు. పాండ్య 13 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 20 పరుగులు చేశాడు.
అంతకుముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ సున్నా పరుగులకే వెనుదిరగ్గా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 28 పరుగులు నమోదు చేశాడు. శాంసన్ (10), శ్రేయాస్ అయ్యర్ (0) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్వెప్సన్ 3, మ్యాక్స్ వెల్ 1, అబ్బాట్ 1, టై 1, జంపా 1 వికెట్ తీశారు.
ఇక వన్డే, టీ20 సిరీస్ లు ముగిసిన నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు డిసెంబరు 17న అడిలైడ్ లో ప్రారంభం కానుంది.