Corona Virus: కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లతో సిద్ధమైన ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్ పోర్టులు
- ఈరోజు బ్రిటన్ లో అందుబాటులోకి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్
- భారత్ లో కూడా వ్యాక్సిన్ పంపిణీ కోసం పడుతున్న అడుగులు
- ఎయిర్ పోర్టుల్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాట్లు పూర్తి
యావత్ ప్రపంచంపై పంజా విసిరిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎట్టకేలకు వ్యాక్సిన్ వచ్చింది. ఈరోజు బ్రిటన్ లో తొలి దశ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చారు. మన దేశంలో సైతం వ్యాక్సిన్ పంపిణీకి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ లో కోట్లాది వ్యాక్సిన్ డోసులు అవసరమవుతాయి. వీటిని రవాణా చేయడం, స్టోర్ చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. వ్యాక్సిన్ పాడు కాకుండా ఉండాలంటే నిరంతరం దాన్ని ఒక నిర్ణీతమైన చల్లటి ఉష్ణోగ్రతలో స్టోర్ చేయాలి. ఈ నేపథ్యంలో మిలియన్ల కొద్దీ వచ్చే వ్యాక్సిన్ డోసులను తీసుకోవడానికి, వాటిని ఉంచేందుకు ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్ పోర్టుల్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాట్లను పూర్తి చేశారు.
మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగి ఉండే కూల్ ఛాంబర్స్ ను ఈ రెండు ఎయిర్ పోర్టుల్లో ఏర్పాటు చేశారు. వీటిలో అడ్వాన్సుడు ఫార్మా, వ్యాక్సిన్ స్టోరేజ్ ఏర్పాట్లను చేశారు. ఎయిర్ క్రాఫ్ నుంచి కార్గో టెర్మినల్ మధ్యలో కూడా వ్యాక్సిన్ టెంపరేచర్ లో మార్పు రాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
కరోనా మన దేశంలోకి ప్రవేశించిన తొలి నాళ్లలో కూడా ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్ పోర్టులు అత్యంత కీలకమైన సేవలను అందించాయి. మనకు అవసరమైన పీపీఈ కిట్లు, వైద్య సామగ్రి, ఇతర అవసరమైన వస్తువులు ఈ విమానాశ్రయాల ద్వారానే దిగుమతి అయ్యాయి. ఇప్పుడు వ్యాక్సిన్ సమయంలో కూడా ఈ రెండు ఎయిర్ పోర్టులు కీలపాత్రను పోషించబోతున్నాయి.