Venkaiah Naidu: ఉద్యోగార్థులుగా కాక ఉద్యోగాల సృష్టికర్తలుగా యువత ఎదగాలి: వెంకయ్యనాయుడు
- విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి
- వర్చువల్ విధానం ద్వారా టీఐఈ గ్లోబల్ సమ్మిట్ లో ప్రసంగం
- దేశ జనాభాలో 65 శాతం యువత అని వెల్లడి
- యువత శక్తిసామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచన
- అభివృద్ధి సాధకులు తమ అనుభవాలను పంచుకోవాలని వ్యాఖ్యలు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖపట్నం పర్యటనలో ఉన్నారు. ఇవాళ విశాఖ నుంచే వర్చువల్ విధానంలో టీఐఈ గ్లోబల్ సమ్మిట్-2020ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాల సృష్టికర్తల్లా యువత ఎదగాలని ఆకాంక్షించారు. దేశ జనాభాలో 65 శాతం మంది యువత అని, వారు తమ శక్తిసామర్థ్యాలను పరిపూర్ణంగా వినియోగించుకోవాలని ఉద్బోధించారు.
అయితే, అభివృద్ధి సాధించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ తర్వాతి తరాలకు మార్గదర్శనం చేయాల్సి ఉంటుందని సూచించారు. వారి అనుభవాలను, విజ్ఞానాన్ని భావి తరాలకు అందజేయాలని తెలిపారు. ఇప్పుడు ఈ టీఐఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను నడిపించేందుకు 300 మందికి పైగా మార్గదర్శకులు అందుబాటులో ఉన్నారని, ఇది హర్షణీయ పరిణామం అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.