India: డిసెంబర్ 25 నుంచి ఇండియాలో టీకా పంపిణీ... సంక్రాంతి నాటికి పోరాట యోధులందరికీ..!

India Vaccination Starts on December 25

  • వాజ్ పేయి జన్మదినం సందర్భంగా టీకా పంపిణీ మొదలు
  • కోవిన్ సాఫ్ట్ వేర్ లో ముందుగా నమోదు చేసుకోవాలి 
  • తొలి దశలో 3 కోట్ల డోస్ లను సిద్ధం చేస్తున్న కేంద్రం
  • నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదినమైన డిసెంబర్ 25న ఇండియాలో కరోనా టీకా పంపిణీ మొదలు కానుంది. భారత ప్రధాని స్వయంగా టీకా పంపిణీని ప్రారంభిస్తారని, ఆపై 20 రోజుల వ్యవధిలో... అంటే, జనవరి 15 నాటికి కరోనాపై జరుగుతున్న పోరాటంలో ముందు నిలిచిన వారందరికీ వ్యాక్సిన్ పంపిణీ పూర్తవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నుంచి సమాచారం అందింది.

వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులకు వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు అన్ని రాష్ట్రాలకూ టీకాను అందుబాటులో ఉంచుతామని, ఆపై సామాన్య ప్రజలకు టీకాను ఇస్తామని అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే 'కోవిన్' పేరిట ప్రత్యేక సాఫ్ట్ వేర్ తయారు కాగా, దీని లైవ్ డిమాన్ స్ట్రేషన్ సందర్భంగా రాష్ట్రాల వైద్య శాఖాధికారులతో కేంద్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సాఫ్ట్ వేర్ లో పేరు నమోదైతేనే టీకా వేయాలని తెలిపారు. టీకా వేసిన తరువాత కనీసం అరగంట పాటు అక్కడే ఉండాలని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లూ లేకుంటేనే ఇంటికి వెళ్లాల్సి వుంటుందని తేల్చి చెప్పారు.

ఇక ఈ సాఫ్ట్ వేర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఆధార్ కార్డు నంబర్ ను నమోదు చేయాల్సిన అవసరం లేదని, సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను వైద్య బృందం తనిఖీ చేస్తుందని, ఆపై వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి గుర్తింపు కార్డు చూపి టీకాను తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఇక ఒక్కో వ్యాక్సిన్ కేంద్రంలో 100 మందికి టీకాను ఇస్తామని, ఇక్కడ రెండు బృందాలు ఉంటాయని, ఒక బృందం రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిని పరిశీలిస్తుందని, మరో బృందం వారికి టీకాను ఇస్తుందని అధికారులు తెలిపారు. ఈ బృందంలో వ్యాక్సినేటర్ తో పాటు నర్స్, ఏఎన్ఎం, డాక్టర్, సహాయకుడు ఉంటారని, ముందు జాగ్రత్త చర్యగా ప్రతి వ్యాక్సిన్ కేంద్రం వద్ద ఒక అంబులెన్స్ ఉంటుందని, ఎవరిలోనైనా దుష్ప్రభావాలు కనిపిస్తే, వెంటనే చికిత్స చేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయని వెల్లడించారు.

టీకా తీసుకున్న వారి మొబైల్ ఫోన్ కు ఒక మెసేజ్ వస్తుందని, ఆపై మూడు వారాల తరువాత మరోమారు టీకా తీసుకోవాల్సిన తేదీ గురించిన సమాచారాన్ని పంపుతామని, రెండు డోస్ లను తీసుకున్న వారికి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ధ్రువపత్రం అందుతుందని తెలియజేశారు. ఇక వ్యాక్సిన్ కేంద్రంలో స్పాట్ రిజిస్ట్రేషన్ కు అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఇదిలావుండగా, ప్రస్తుతం డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) వద్ద మూడు వ్యాక్సిన్ సంస్థలు అనుమతి కోరుతూ దరఖాస్తులు చేసుకున్న సంగతి తెలిసిందే. నేడు సమావేశం కానున్న నిపుణుల కమిటీ ఈ మూడింటిపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. తొలి దశలో మొత్తం మూడు కోట్ల డోస్ ల టీకాలను నిల్వ చేసేలా ఎక్కడికక్కడ ఫ్రీజర్ బాక్స్ లను సిద్ధం చేయగా, కరోనా టీకా రవాణాకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని కార్గో విభాగం అన్ని ఏర్పాట్లూ చేసింది.

  • Loading...

More Telugu News