IYR Krishna Rao: వ్యవసాయ చట్టాలపై అపోహలు ఉన్నాయి.. వాస్తవం ఇదీ: వివరించిన ఐవైఆర్
- రైతు దేశంలో ఎక్కడైనా పంటలు అమ్ముకోవచ్చు
- అంటే బస్తా ధాన్యం తీసుకుపోయి అసోంలో అమ్మవచ్చు అనేది పెడార్థం
- సరైన అర్థం జాతీయ మార్కెట్ ఏర్పడుతుంది
- కాబట్టి కొనుగోలు ధర పెరుగుతుంది
- ప్రభుత్వ మార్కెట్ యార్డులు మూత పడతాయని అపోహ ఉంది
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘వ్యవసాయ చట్టం- అపోహలు- నిజాలు’ అంటూ ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర విషయాలు తెలిపారు. సవరించిన చట్టంతో రైతు పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అన్నారు. అయితే, రైతు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే బస్తా ధాన్యం తీసుకుపోయి అసోంలో అమ్మవచ్చు అనేది పెడార్థమని తెలిపారు.
సరైన అర్థం జాతీయ మార్కెట్ ఏర్పడుతుంది కాబట్టి కొనుగోలు ధర పెరుగుతుందని చెప్పారు. కేవలం మార్కెట్ యార్డ్ లోనే కాక బయట కూడా అమ్ముకునే వెసులుబాటు లభిస్తుందని వివరించారు. మార్కెట్ యార్డ్ చెక్ పోస్ట్ లు ఉండవు కాబట్టి సరకు రవాణా నిరంతరంగా జరగటానికి, జాతీయ మార్కెట్ లాభాలు రైతుకు రావడానికి అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.
అలాగే, ఈ చట్టంతో ఇప్పుడు నడిచే ప్రభుత్వ మార్కెట్ యార్డులు మూత పడతాయని అపోహ ఉందని ఐవైఆర్ తెలిపారు. పోటీ ఉంటుంది కాబట్టి మార్కెట్ యార్డులు సమర్థవంతంగా పని చేస్తాయని తెలిపారు. ప్రభుత్వ మార్కెట్ యార్డ్ లకు చారిత్రకంగా చాలా సదుపాయాలు ఉన్నాయని, ప్రభుత్వం నుంచి ఉచితంగా వచ్చిన భూమిపై, మార్కెట్ ఫీజు ద్వారా ఉన్న కార్పస్ పై, ఇప్పటిదాకా జవాబుదారితనం లేకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న నామినేటెడ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ల మధ్య పోటీ ఉంటుంది కాబట్టి బాధ్యతతో ప్రవర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.
అంబానీలు, అదానీలు మార్కెట్ యార్డ్ లు పెడతారని, దీంతో మార్కెట్ యార్డ్ లు కార్పొరేట్ల చేతిలోకి పోతాయని అపోహ ఉందని చెప్పారు. అయితే, లాభాలు లేనిదే ఎవరూ పెట్టుబడి పెట్టరని చెప్పారు. మార్కెట్ యార్డ్ ల ఏర్పాటు నిర్వహణలో అంతపెద్ద లాభాలు ఉండే అవకాశం లేదని ఆయన వివరించారు. అంతేగాక, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మార్కెట్ యార్డ్ చట్టంలో ప్రైవేట్ మార్కెట్ యార్డ్ లు పెట్టుకోవడానికి అవకాశం దశాబ్దం కిందటే కల్పించారని చెప్పారు. ఇప్పటి వరకు వచ్చినవి రెండు, మూడు ఉన్నాయని వివరించారు.