Bharat Biotech: కరోనా టీకా విషయంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నాం: కృష్ణ ఎల్లా
- కేంద్రం ఆధ్వర్యంలో జినోమ్ వ్యాలీని సందర్శిస్తున్న రాయబారులు, హైకమిషనర్లు
- కొవాగ్జిన్ టీకా గురించి వివరించిన కృష్ణ ఎల్లా
- విదేశీ సంస్థలతో కలసి ప్రయోగాలు చేస్తున్నామన్న భారత్ బయోటెక్
దేశంలో కరోనా టీకా తయారీపై అధ్యయనంలో భాగంగా 64 దేశాల రాయబారులు జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్‌ను సందర్శించినట్టు ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. టీకా రంగంలో భారత్ ఎన్నో ప్రయోగాలు చేస్తోందన్నారు. అనేక విదేశీ సంస్థలతో కలిసి భారత్ బయోటెక్ ప్రయోగాలు చేస్తోందన్నారు. కరోనా టీకా విషయంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నట్టు కృష్ణ ఎల్లా పేర్కొన్నారు.
కాగా, భారత్‌లో టీకా పురోగతిని వివరించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన పర్యటన మేరకు 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరు రెండు బృందాలుగా పర్యటిస్తున్నారు. మొదటి బృందం భారత్ బయోటెక్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా కొవాగ్జిన్ టీకా వివరాలను డాక్టర్ కృష్ణ ఎల్లా వారికి వివరించారు. ఇక రెండో బృందం బయోలాజికల్-ఇ సంస్థను సందర్శించింది. విదేశీ రాయబారులు, హైకమిషనర్లు పెద్ద ఎత్తున తెలంగాణను సందర్శించడం ఇదే తొలిసారి.