Jagananna Jeeva Kranthi: ఏపీలో మరో పథకం 'జగనన్న జీవ క్రాంతి'... నేడు ప్రారంభించిన జగన్!
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు గొర్రెలు, మేకలు
- రూ. 1,863 కోట్ల అంచనా వ్యయం
- మూడు విడతలుగా పంపిణీ చేయనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో మరో సంక్షేమ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ఈ ఉదయం ప్రారంభించారు. 'జగనన్న జీవ క్రాంతి' పేరిట ఈ పథకానికి శ్రీకారం చుట్టిన ఆయన, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వర్చ్యువల్ విధానంలో దీన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి, రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ చేయనుంది.
మొత్తం 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్లను పంపిణీ చేసే దిశగా రూ. 1868.63 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మూడు విడతలుగా పథకం అమలు అవుతుందని, తొలి విడతగా వచ్చే సంవత్సరం మార్చిలో 20 వేల యూనిట్లు, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య రెండో విడతగా 1,30,000 యూనిట్లు, ఆపై సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య 99 వేల యూనిట్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.