talaq: అమెరికా నుంచి ఫోను చేసి తలాక్ చెప్పిన భర్త.. ఫిర్యాదు చేసిన హైదరాబాద్ యువతి
- హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉంటోన్న భార్య
- కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆశ్రయించిన యువతి
- తనకు న్యాయం చేయాలని వినతి
ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినప్పటికీ ఇంకా కొన్నిచోట్ల అది కొనసాగుతూనే వుంది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఉంటోన్న ఓ యువతి (25)కి ఆమె భర్త ఫోను చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో బాధిత మహిళ దీనిపై ఫిర్యాదు చేసింది. పాతబస్తీకి చెందిన సభా ఫాతిమా అనే యువతిని వలి అనే యువకుడు 2015 జనవరిలో హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నాడు.
వలి అమెరికాలో ఉంటుండగా ఫాతిమా హైదరాబాద్ లో ఉంటోంది. తాజాగా, తన భర్త వలి అమెరికా నుంచి ఫోన్ చేశాడని, దాని ద్వారానే ట్రిపుల్ తలాక్ చేప్పాడని తెలుపుతూ ఫాతిమా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. ముస్లిం సంప్రదాయాల ప్రకారం తాను వలిని పెళ్లి చేసుకున్నానని తెలిపింది.
అనంతరం కొన్నాళ్లు హైదరాబాద్ లోని మలక్‌పేట, టోలిచౌకిలలో అద్దె ఇంట్లో నివాసం ఉన్నామని, ఆ తర్వాత తన భర్త విదేశాలకు వెళ్లినట్టు వివరించింది. ప్రతి 6 నెలలకు ఓ సారి ఆయన హైదరాబాద్ కు వస్తున్నట్టు చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఇక్కడకు వచ్చాడని వివరించింది.