Tiger: అటవీశాఖ అధికారులే పులులను వదిలారు: ఆదివాసుల ఆరోపణ
- ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలను చంపుతున్న పెద్దపులి
- పులిని చంపడానికి తమకు ఎంతో సమయం పట్టదంటున్న ఆదివాసీలు
- చట్టానికి లోబడి తాము ఆ పని చేయడం లేదని వ్యాఖ్య
ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలను పెద్దపులి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పులి పలువురి ప్రాణాలను బలిగొంది. ఎన్నో జంతువులను చంపేసింది. ఈ నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే అటవీప్రాంతంలోని వారు భయపడుతున్నారు.
ఈ క్రమంలో స్థానికులు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. అటవీ అధికారులే పులులను వదిలిపెట్టి, ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని వారు అంటున్నారు. పోడు భూముల వ్యవహారంలో తమను భయానికి గురి చేసేందుకు యత్నిస్తున్నారని చెపుతున్నారు. అడవి నుంచి తమను దూరం చేయాలనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తన సోదరిని పులి చంపేసిందని కొండపల్లికి చెందిన ఒక వ్యక్తి కన్నీటిపర్యంతం అయ్యాడు. ఆ పులిని చంపడానికి తమకు ఎంతో సమయం పట్టదని... అయితే, వన్యప్రాణులను చంపకూడదనే చట్టాలకు లోబడి తాము ఆ పని చేయడం లేదని చెప్పాడు. తన చెల్లిని పులి చంపిన కేసులో అటవీ అధికారులపై ఇంత వరకు కేసు నమోదు చేయలేదని అన్నాడు. ఒకవేళ పులిని తాము చంపితే మాత్రం కేసులు పెట్టి, జైలుకు పంపిస్తారని వాపోయాడు.