Anjan Kumar Yadav: నాకు ప్రమోషన్ కావాలి... హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి అందుకే తప్పుకున్నా: అంజన్ కుమార్ యాదవ్
- ఉత్తమ్ రాజీనామాతో ఖాళీ అయిన పీసీసీ అధ్యక్ష పదవి
- అభిప్రాయ సేకరణ జరుపుతున్న మాణికం ఠాగూర్
- పీసీసీ పీఠాన్ని ఆశిస్తున్న అంజన్ కుమార్
- రెండుసార్లు ఎంపీగా పనిచేసిన తాను అర్హుడ్నేనని వెల్లడి
- జీవితాంతం కాంగ్రెస్ లోనే ఉంటానని ఉద్ఘాటన
తెలంగాణ కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు ముమ్మరంగా చేస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షునిగా ప్రమోషన్ కోసమే పదవికి రాజీనామా చేశానని అంజన్ కుమార్ వెల్లడించారు. రాజకీయ జీవితం ఉన్నంత వరకు కాంగ్రెస్ లోనే ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలోకి వెళ్లబోనని స్పష్టం చేశారు. రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన తాను పీసీసీ అధ్యక్ష పదవికి అర్హుడ్నేనని అన్నారు.
పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకోవడంతో కొత్త అధ్యక్షుడి కోసం కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తులు చేస్తోంది. ఈ పని మీదనే హైదరాబాద్ వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. మాణికం ఠాగూర్ ఇచ్చే నివేదిక ఆధారంగానే సోనియా, రాహుల్ గాంధీ కొత్త పీసీసీ అధ్యక్షుడ్ని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పీఠం కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.