Chandrababu: సీఎం సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండాపోయింది: డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు
- పులివెందులలో ఎస్సీ మహిళపై హత్యాచారం
- నిందితులను కాపాడేందుకు యత్నిస్తున్నారన్న చంద్రబాబు
- ఎఫ్ఐఆర్ లో గుర్తుతెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని వెల్లడి
- బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్
- వైసీపీ అండతోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపణ
కడప జిల్లా పులివెందులలో ఎస్సీ మహిళపై అత్యాచారం జరిగిందని, సీఎం జగన్ సొంత నియోజకవర్గంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అత్యాచారం చేసి చంపేశారని, నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎఫ్ఐఆర్ లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొనడమే అందుకు నిదర్శనమని తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పులివెందుల తరహా ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని, వైసీపీ పాలనలో శాంతిభద్రతలు కరవయ్యాయని ఆరోపించారు. అధికార పక్షం అండతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చట్టాన్ని గట్టిగా అమలు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తన లేఖలో స్పష్టం చేశారు.