Space X: భూమిపై ల్యాండ్ అవుతూ పేలిపోయిన స్పేస్‌ఎక్స్ నమూనా రాకెట్.. అయినా పర్వాలేదన్న ఎలాన్ మస్క్!

Space X Mars prototype rocket exploded

  • విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్
  • తిరిగి భూమికి వస్తుండగా నియంత్రణలోకి రాని వేగం
  • రాకెట్ పేలిపోయిన దృశ్యాలను ప్రసారం చేసిన స్పేస్ ఎక్స్

ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ రాకెట్ ఒకటి భూమిపై ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. అమెరికాలోని టెక్సాస్ తీరంలో మొన్న జరిగిందీ ఘటన. రాకెట్ పేలిపోయినట్టు వెల్లడించిన స్పేస్‌ఎక్స్.. ఆ దృశ్యాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రసారం చేసింది. చంద్రుడు, అంగారకుడిపైకి మానవులను, సామగ్రిని తీసుకెళ్లి, తిరిగి భూమిపైకి సురక్షితంగా తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్.. స్టార్‌షిప్ పేరుతో వ్యోమనౌకలను తయారు చేస్తోంది. ఆ రాకెట్ల పనితీరును తెలుసుకునేందుకు తొలుత నమూనా రాకెట్లతో ప్రయోగాలు నిర్వహిస్తారు. బుధవారం నిర్వహించిన ప్రయోగం అలాంటిదే.

ప్రయోగంలో భాగంగా నంబర్ 8 రాకెట్‌లోని లోహ కవచ దృఢత్వం, మూడు ఇంజిన్ల  పనితీరు, రాకెట్ తిరిగి భూమిపైకి చేరుకునే సమయంలో ఎదురయ్యే సవాళ్లు వంటి వాటిని అంచనా వేశారు. రాకెట్ తొలుత నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ముందుగా చేసిన ప్రోగ్రామింగ్ ప్రకారం రాకెట్ నిర్ణీత ఎత్తుకు వెళ్లిన తర్వాత  రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. దీంతో అది తిరిగి భూమిపైకి ప్రయాణం ప్రారంభించింది. సరిగ్గా 4.45 గంటలకు మూడో ఇంజిన్ కూడా ఆఫ్ అయింది.

గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో నేలపైకి అత్యంత వేగంగా దూసుకొస్తున్న రాకెట్‌ను అదుపు చేసేందుకు ఆగిపోయిన రెండు ఇంజిన్లు తిరిగి స్టార్ట్ అయ్యాయి. అయితే, వేగాన్ని నియంత్రించుకునే విషయంలో విఫలం కావడంతో రాకెట్ నేరుగా భూమిని ఢీకొట్టి పేలిపోయింది. రాకెట్ పేలిపోయినా తమకు కావాల్సిన విలువైన సమాచారం మాత్రం దొరికిందని స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News