Rakul Preet Singh: సినీ నటి రకుల్ ప్రీత్‌సింగ్‌పై ఏంటా కథనాలు?.. టీవీ చానళ్లకు తలంటిన ఎన్‌బీఎస్ఏ
- బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో రకుల్‌పై ఆరోపణలతో కూడిన కథనాలు
- ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ జీ నెట్‌వర్క్‌కు ఆదేశం
- కథనాలు ప్రసారం చేసేటప్పుడు వాస్తవికతను నిర్ధారించుకోవాలని సూచన
డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్‌పై బురద జల్లేలా కథనాలు ప్రసారం చేశారంటూ న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్‌బీఎస్ఏ) పలు టీవీ చానళ్లకు తలంటింది. రకుల్‌పై కథనాలు ప్రసారం చేసిన జీన్యూస్, జీ24టాస్, జీ హిందూస్థానీ, టైమ్స్ నౌ, ఇండియా టుడే, ఆజ్‌తక్, న్యూస్ నేషన్, ఏబీపీ న్యూస్ చానళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో రకుల్‌పై ఆరోపణలతో కూడిన కథనాలను ప్రసారం చేశారంటూ మండిపడింది.
తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు గాను రకుల్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జీ నెట్‌వర్క్‌కు చెందిన మూడు చానళ్లను ఎన్‌బీఎస్ఏ ఆదేశించింది. ఆ కథనాలకు సంబంధించిన లింకులు యూట్యూబ్‌లో, వెబ్‌సైట్లలో ఉంటే వెంటనే తొలగించి, వారం లోపు తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. కథనాలను ప్రసారం చేయడానికి ముందు వాటి వాస్తవికతను నిర్ధారించుకోవాలని సూచించింది.