America: కరోనా టీకా విస్తృత వినియోగానికి అమెరికా ప్రభుత్వ నిపుణుల కమిటీ పచ్చజెండా
- ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాకు ప్రభుత్వ నిపుణుల కమిటీ ఆమోదం
- ఎఫ్‌డీఏ ఆమోదించడమే తరువాయి
- తొలి విడతలో అత్యవసర సిబ్బంది, వృద్ధులకు వ్యాక్సినేషన్
అమెరికా ప్రజలకు ఇది గొప్ప శుభవార్తే. కరోనాతో అల్లాడిపోతున్న అగ్రరాజ్యంలో భారీ ఎత్తున వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఫైజర్-బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకా విస్తృత వినియోగానికి ప్రభుత్వ నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక, ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం లభించిన వెంటనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
16 ఏళ్లు ఆపైన వయసున్న వారితోపాటు పెద్దలకు అత్యవసర వినియోగానికి ఈ టీకా సురక్షితమైనదని, సమర్థవంతమైనదని 17-4 ఓట్ల తేడాతో నిపుణల కమిటీ ఆమోదం తెలిపింది. దేశంలో ప్రతిరోజూ దాదాపు 3 వేల కొవిడ్ మరణాలు నమోదవుతున్న వేళ ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాకు ఆమోదం లభించడం శుభపరిణామంగా చెబుతున్నారు.
దీనిని రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు నాటికి రెండున్నర కోట్ల డోసులను అందిస్తామని ఈ సందర్భంగా ఫైజర్ తెలిపింది. తొలి దశలో వైద్యారోగ్య, నర్సింగ్‌హోం, ఇతర అత్యవసర సిబ్బంది, వృద్ధులకు ఇవ్వనున్నారు.