Time: జో బైడెన్, కమల హారిస్ లకు సంయుక్తంగా టైమ్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు!
- 1927 నుంచి అవార్డులు ప్రకటిస్తున్న టైమ్
- ట్రంప్, ఆంటోనీ ఫౌజీలను దాటి అవార్డు గెలిచిన బైడెన్ - హారిస్
- విభజన శక్తులను ఓడించారన్న మేగజైన్
2020 సంవత్సరానికి మేటి వ్యక్తులుగా యూఎస్ కు కాబోయే అధ్యక్ష, ఉపాధ్యక్షుల జోడీ జో బైడెన్, కమల హారిస్ లను ఎంపిక చేసినట్టు ప్రతిష్ఠాత్మక టైమ్ మేగజైన్ ప్రకటించింది. వీరిద్దరూ అమెరికా చరిత్రను మార్చనున్నారన్న టైటిల్ తో తాజా సంచికను విడుదల చేసిన టైమ్, పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఇద్దరినీ ఎంపిక చేశామని తెలిపింది.
ఈ జాబితా ఫైనల్ లిస్టుల్లో కరోనా ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్లు, ప్రస్తుత యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌజీ తదితరులు కూడా నిలిచారని ఈ సందర్భంగా మేగజైన్ ప్రకటించింది. బైడెన్ - హారిస్ జోడి విభజన శక్తులకన్నా సానుభూతి గొప్పదని నిరూపించారని, మహమ్మారి పరిస్థితుల్లో వైద్యంపై దృష్టిని సారించారని ప్రశంసల వర్షం కురిపించింది.
కాగా, 1927 నుంచి ప్రతి సంవత్సరమూ టైమ్ మేగజైన్ ఈ అవార్డులను ప్రకటిస్తున్నదన్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ ను, అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ ను పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా మేగజైన్ గుర్తించింది. గత నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పై విజయం సాధించిన బైడెన్ జనవరిలో నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.