Kishan Reddy: తెలంగాణలో కుటుంబ పాలనపై ప్రజల అసంతృప్తి.. మార్పు కోరుకుంటున్నారు: కిషన్ రెడ్డి
- నిరంకుశ విధానాలతో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారు
- దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీలో వచ్చిన ఫలితాలే నిదర్శనం
- నూతన వ్యవసాయ చట్టాలపై ఉద్దేశపూర్వకంగానే విమర్శలు
- రైతులను పలు రాజకీయ పార్టీలు గందరగోళానికి గురిచేస్తున్నాయి
తెలంగాణలో కుటుంబ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ విధానాలతో రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారని విమర్శలు గుప్పించారు. వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చినట్టు తెలిపారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీలో వచ్చిన ఓటర్ల తీర్పుతో ఈ విషయం అర్థమవుతోందని చెప్పారు.
ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఉద్దేశపూర్వకంగానే రైతులను పలు రాజకీయ పార్టీలు గందరగోళానికి గురిచేస్తున్నాయని విమర్శించారు. దేశంలోని రైతులకు మంచి జరిగితే ఆ పార్టీలే ఓర్చుకోలేకపోతున్నాయని చెప్పుకొచ్చారు. ఆయా చట్టాల్లోని ఏ అంశమూ రైతులకు వ్యతిరేకంగా లేదని తెలిపారు. ఒకవేళ దేశంలో ఈ వ్యవసాయ చట్టాలు అమలైతే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగుండదని కొన్ని రాజకీయ పార్టీల నేతలకు భయం పట్టుకుందని ఆయన చెప్పారు. పంజాబ్‌లో మాత్రమే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు.