Malaria: కేరళలో కొత్త రకం మలేరియా... సూడాన్ నుంచి వచ్చిన సైనికుడిలో గుర్తింపు

New type of Malaria emerges in Kerala

  • భారత్ లో ప్రవేశించిన ప్లాస్మోడియం ఒవాల్
  • జ్వరంతో బాధపడుతున్న సైనికుడికి మలేరియా నిర్ధారణ
  • ఆఫ్రికా, పసిఫిక్ దీవుల్లో ఎక్కువగా కనిపించే ఒవాల్
  • ఆఫ్రికా వెలుపల దీని ప్రభావం ఒకశాతం మాత్రమే!
  • ప్రారంభ దశలోనే కట్టడి చేయాలంటున్న నిపుణులు

మలేరియా ఎంతటి ప్రాణాంతక వ్యాధో చెప్పనక్కర్లేదు. అయితే కేరళలో ఓ సైనికుడిలో కొత్త రకం మలేరియాను గుర్తించారు. ఈ తరహా మలేరియా ప్లాస్మోడియం ఒవాల్ అనే పరాన్నజీవి కారణంగా సంక్రమిస్తుందని వెల్లడైంది. సాధారణంగా ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపెరం, ప్లాస్మోడియం నొలేసి పరాన్నజీవులతో సంభవించే మలేరియా జ్వరాలు భారత్ లో ఇంతకుముందు నుంచి ఉన్నాయి. అయితే ప్లాస్మోడియం ఒవాల్ పరాన్నజీవితో మలేరియా వ్యాధిని గుర్తించడం ఇదే ప్రథమం.

ఆ సైనికుడు ఇటీవలే ఆఫ్రికాలోని సూడాన్ నుంచి కేరళ వచ్చాడు. అతడు జ్వరంతో బాధపడుతుండడంతో వైద్య పరీక్షలు చేయగా ప్లాస్మోడియం ఒవాల్ పరాన్నజీవితో కలిగిన మలేరియా అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతడు కన్నూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వివరాలను కేరళ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు.

ప్లాస్మోడియం ఒవాల్ పరాన్నజీవి ఏమంత ప్రమాదకారి కాదు. దీని ఉనికి 1922లో గుర్తించగా, ఇది ఎక్కువగా పశ్చిమ ఆఫ్రికా, పశ్చిమ పసిఫిక్ దీవుల్లో వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. ఆఫ్రికా ఖండం వెలుపల దీని బారినపడేవాళ్లు ఒకశాతం లోపే ఉంటారు. అయితే ప్లాస్మోడియం ఒవాల్ పరాన్నజీవి భారత్ లో ప్రవేశించిన నేపథ్యంలో అది జన్యు ఉత్పరివర్తనాలకు లోనయ్యే అవకాశం ఉంటుందని, ప్రారంభదశలోనే దీన్ని కట్టడి చేయడం మేలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News