Mamata Banerjee: నిప్పుతో చెలగాటం ఆడొద్దు: మమతా బెనర్జీపై గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు
- హుందాగా, దయాగుణంతో వ్యవహరించాలి
- భారతీయులందరూ ఒకటే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి
- సీఎస్, డీజీపీలు చేసిన పనికి సిగ్గుపడుతున్నాను
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పశ్చిమబెంగాల్ లో రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై కోల్ కతాలో దాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. బీజేపీ నేతలు వరుసగా తమ రాష్ట్రంలోకి వస్తున్నారని... ఇక్కడ వారికేం పని అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించడం వివాదాన్ని తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో మమతకు ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ హెచ్చరిక జారీ చేశారు. 'మేడమ్... నిప్పుతో చెలగాటమాడొద్దు' అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
బెంగాల్ లో నానాటికీ శాంతిభద్రతలు దిగజారుతున్నాయంటూ కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఆయన నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిపై దారుణంగా దాడికి తెగబడ్డారని మండిపడ్డారు. ఈ దాడిలో రాష్ట్ర పార్టీకి చెందిన వారు ఉన్నారని అన్నారు. వీరికి అధికారులు, పోలీసుల అండదండలు ఉన్నాయని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నమే అని అన్నారు. కేంద్రానికి తానిచ్చిన నివేదికలో ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు. నిన్న జరిగిన దాడి చాలా దురదృష్టకరమని అన్నారు.
జరిగిన దాడిపై నివేదికను తయారు చేయాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీలను తాను ఆదేశించానని.. కానీ రిపోర్టు లేకుండానే వారు తన వద్దకు వచ్చారని మండిపడ్డారు. అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు ఇలా చేయడం సిగ్గుచేటని అన్నారు. వృత్తి పట్ల వారికి నైతిక బాధ్యత ఉండాలని... వారు చేసిన పనికి షాకయ్యానని, సిగ్గుపడ్డానని చెప్పారు. రాజ్యాంగ విధుల్లో ఉన్న తనకు ఇదొక బాధాకరమైన సమయమని అన్నారు.
బీజేపీకి ఏం పని లేదని... ఒక రోజు కేంద్ర హోంమంత్రి వస్తారని... ఆ తర్వాత నడ్డా, గడ్డా, చడ్డా, ఫడ్డా వస్తారంటూ మమత చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ మండిపడ్డారు. సీఎం చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా పరిగణిస్తున్నానని చెప్పారు. ఆమె హుందాగా, దయాగుణంతో వ్యవహరించాలని ఆశిస్తున్నానని అన్నారు. చేసిన వ్యాఖ్యలను ఆమె వెనక్కి తీసుకోవాలని కోరుతున్నానని చెప్పారు. భారత్ అంతా ఒకటేనని, భారతీయులంతా ఒకటేనని చెప్పారు. ఎవరు బయటివారు, ఎవరు లోపలి వారు అని ప్రశ్నించారు.