Prithipal Singh Gill: ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లలో పని చేసిన ఏకైక అధికారి.. 100వ జన్మదినం జరుపుకుంటున్న యోధుడు !
- త్రివిధ దళాల్లో పని చేసిన ప్రీతిపాల్ సింగ్ గిల్
- రెండో ప్రపంచ యుద్ధానికి ముందు రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్సులో తొలి ఉద్యోగం
- 1965లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న గిల్
కల్నల్ ప్రీతిపాల్ సింగ్ గిల్... మన దేశంలో మరెవరూ సాధించలేని ఘనత ఈయన సొంతం. భారత త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింటిలో ఆయన పని చేశారు. ఈరోజుతో ఆయన 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా ఆయన తొలి ఉద్యోగాన్ని చేశారు. ఆ తర్వాత ఇండియన్ నేవీలో పని చేస్తూ ప్రపంచ మహాసముద్రాలపై విధులను నిర్వహించారు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలో గన్నర్ ఆఫీసర్ గా పని చేశారు.
వరల్డ్ వార్-2 తో పాటు 1965లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో కూడా గిల్ పాల్గొన్నారు. పదవీ విరమణ పొందడానికి ముందు మణిపూర్ లో అస్సాం రైఫిల్స్ విభాగంలో సెక్టార్ కమాండర్ గా ఆయన విధులు నిర్వహించారు. గిల్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.